
‘‘ఒకప్పుడు శాటిలైట్ హక్కులు, ఆ తర్వాత హిందీ డబ్బింగ్ హక్కులు, ఇటీవల ఓటీటీ ... ఇలా ఒక్కో టైమ్‌లో ఒక్కో విధంగా నిర్మాతలకు ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్‌లో ఆడిన సినిమాలే ఎక్కువ లాభాలను తీసుకువచ్చాయి. థియేటర్స్‌లో ఆడిన సినిమాలే మంచివని నిర్మాతలు మరింత నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు కూడా బాగుంటాయి. ఓటీటీ వాళ్ల నుంచి డబ్బులొస్తాయి అని హీరో–డైరెక్టర్ కాంబినేషన్‌ని సెట్ చేసుకుని ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు’’ అని నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) అన్నారు.
ఈరోజుల్లో మూవీ చేశాం..
సోమవారం (జూలై 7) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ– ‘‘జర్నలిస్ట్‌గా ఉన్న నేను చరణ్, బన్నీ (రామ్‌చరణ్, అల్లు అర్జున్) సలహా మేరకు పీఆర్‌ఓగా కెరీర్ ఆరంభించాను. అయితే దర్శకుడు మారుతి తన దర్శకత్వంలో చేయబోయే సినిమాకు నిర్మాతగా ఉండమని ప్రోత్సహించాడు. అలా మారుతి దర్శకత్వంలో నేను, శ్రేయాస్ శ్రీను కలిసి ‘ఈ రోజుల్లో..’ సినిమా చేశాం. ఆ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా నా జర్నీ మొదలైంది.
25 మంది తెలుగమ్మాయిల పరిచయం
ఇక యూవీ క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్, మైత్రీ... ఇలా ఇతర నిర్మాణ సంస్థలతోనూ అసోసియేట్ అయి, సినిమాలు చేస్తున్నానంటే ఇందుకు కారణం అల్లు అరవింద్‌గారు ఇచ్చిన ప్రోత్సాహం. ఎలాంటి కష్టం వచ్చినా స్థిరంగా ఉండటం మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు నుంచి నేర్చుకున్నా. అల్లు అర్జున్‌గారి నుంచి నాకు మోరల్ స΄ోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అయితే నిర్మాతగా ఉండటం అనేది ముళ్ల సింహాసనం లాంటిది. ఇక 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్‌తో ఏడెనిమిది మందిని పరిచయం చేశాను.
సినిమాలు
హీరోయిన్స్ అని మాత్రమే కాకుండా... ఇతర విభాగాల్లోనూ చాన్స్ కల్పిస్తున్నాం. త్వరలో ఓ మహిళా దర్శకురాలిని పరిచయం చేయనున్నాను. ఇక రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’, కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. తెలుగు ‘బేబీ’ హిందీ రీమేక్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభిస్తాం. సంతోష్ శోభన్, అలేఖ్య హారికల సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నూతన దర్శకులు కృష్ణ, అవినాష్‌లతో సినిమాలు ఉన్నాయి. ‘ది రాజాసాబ్’ తర్వాత మారుతితో ఓ సినిమా, హిందీ ‘బేబీ’ తర్వాత సాయి రాజేశ్‌తో మరో సినిమా ఉన్నాయి. ‘త్రీ రోజెస్ 2’ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది’’ అని చెప్పారు.