కోలీవుడ్ హీరో సూర్య లేటేస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కరుప్పు. గత వారంలో రిలీజైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ మూవీకి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాదనిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటేసింది.
అయితే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై కొంత మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మూవీ కమల్‌హాసన్ విక్రమ్‌తో పోలుస్తున్నారు. కరుప్పు మూవీకి వస్తున్న మిక్స్‌డ్ రెస్పాన్స్‌పై సూర్య సతీమణి జ్యోతిక స్పందించింది. ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని.. సృజనాత్మక కోణంలోనే చూడాలని సూచించింది. ఈ సినిమాకంటూ ఒక ఆత్మ ఉందని అన్నారు. సూర్య కెరీర్‌లో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం కాకపోయినా.. ప్రేక్షకులు ఎదురుచూస్తున్న దాన్ని ఈ సినిమా అందించిందని తెలిపింది.
జ్యోతిక మాట్లాడుతూ.." కరుప్పు చూసి మేము చాలా ఉద్వేగానికి లోనయ్యాము. సూర్య మంచి కథలనే ఇష్టపడతాడు. అతను ప్రతి సినిమాలో ఒక కథ ఉండేలా చూసుకుంటాడు. కానీ హీరోలకు బాక్సాఫీస్ వసూళ్లు కూడా అవసరమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఎవరూ నష్టపోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మంచి వసూళ్లు సాధించడం చాలా ముఖ్యం. ఇది కేవలం కమర్షియల్ లాభాల కోసం తీసినది కాదు. దానికంటూ ఒక ఆత్మ ఉంది. సామాన్య ప్రజలు చూసేలా విభిన్నంగా రూపొందించారు. కానీ సినిమా చివరి పది నిమిషాల్లో సూర్య అద్భుతంగా నటించారు' అని అన్నారు.


