కథానాయికల పాత్రల తీరుపై జయా బచ్చన్
సినిమాల్లో మహిళల పాత్రలను వెండితెరపై చూపించే విధానంపై సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన పా త్రను సిల్వర్ స్క్రీన్‌పై దర్శకుడు బుచ్చిబాబు కాస్త అభ్యంతరకరంగా చూపించారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జయా బచ్చన్ వెండితెరపై కథానాయికలను చూపించే విధానంపై స్పందించారు.
సినిమాల్లో మహిళల పా త్రలను కేవలం గ్లామర్ కోణంలోనే చూపించడం సరైనది కాదని ఆమె పేర్కొన్నారు. ఈ అంశం గురించి ఓ ఆంగ్ల మీడియాతో జయా బచ్చన్ మాట్లాడుతూ– ‘‘హీరోయిన్లు తమకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే సెట్స్‌లోనే స్పందించాలి... తిరగబడాలి. ఫలానా సన్నివేశం చేయడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పాలి’’ అని పేర్కొన్నారు. హిందీ చిత్రం ‘షోర్’ చిత్రీకరణలో భాగంగా ఆ చిత్రదర్శకుడు (మనోజ్‌కుమార్) జయా బచ్చన్‌ను గాగ్రా చోళీలోనే సినిమా అంతా కనిపించాలని చెప్పారట. అయితే దుపట్టా ధరిస్తానని ఆ దర్శకుడితో జయా బచ్చన్ అన్నారట.
ఈ విషయమై జయా బచ్చన్‌కు, ఆ దర్శకుడికి పెద్ద గొడవ జరిగిందట. ఆ తర్వాత ఓ సన్నివేశం ఇబ్బందికరంగా అనిపించడంతో నటించనని జయా బచ్చన్ తేల్చి చెప్పారట. ‘‘నా కెరీర్‌లో నన్ను అలా చూపించడానికి ప్రయత్నించిన చేదు అనుభవం అదొక్కటే. ఆ తర్వాత సెట్స్‌లో నాతో హద్దులు దాటి ప్రవర్తించేందుకు, సినిమాలో ఎలా పడితే అలా చూపించేందుకు ఎవరూ సాహసించలేదు. అలాగే ఆ దర్శకుడితో నేను మళ్లీ కలిసి పని చేయలేదు’’ అని పేర్కొన్నారు జయా బచ్చన్.
అందుకు మా అత్తగారు ఓ ఉదాహరణ: కరీనా కపూర్
జయా బచ్చన్ మాటలకు మద్దతు ఇస్తూ కరీనా పూర్ తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు. ‘‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రంలోని ‘సూరజ్ హువా..’ పా టలో కాజోల్‌గారిని లేదా ‘చాందినీ’ సినిమాలోని ‘తేరే మేరే..’ పా టలో శ్రీదేవిగారిని చూడండి. సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఎంతో ఆకర్షణీయంగా కనిపించారు. అలాగే ‘ఆరాధన’ చిత్రంలో ‘రూప్ తెరా మస్తానా’ పా టలో మా అత్తగారు (షర్మిలా ఠాగూర్) నిండైన వస్త్రధారణతో కనిపిస్తారు.
అయినప్పటికీ వెండితెరపై అందంగా కనిపించారు. తక్కువ దుస్తులతో కాకుండా హుందాగా కనిపించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చనడానికి ఆమె ఓ ఉదాహరణ. తెరపై ఆకర్షణీయంగా కనిపించడం అంటే ఒళ్లు కనిపించేలా దుస్తులు ధరించడం కాదు.. నిండైన వస్త్రధారణలోనూ ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అలాగే హీరోయిన్‌ను కేవలం ఒక వస్తువులా చూపించడం సరికాదని నా అభిప్రాయం’’ అని కరీనా కపూర్ పేర్కొన్నారు.


