
ప్రేమించిన ప్రియుడు తనను అష్టకష్టాలు పెట్టాడని వాపోయింది మలయాళ బుల్లితెర నటి జసీలా ప్రవీణ్ (Jaseela Parveen). మాటలతోనే కాకుండా చేతలతో నరకం చూపించాడని పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యాలను సోతం సోషల్ మీడియాలో బయటపెట్టింది. అందులో ఓ ఫోటోలో జసీలా తలపై గాయాలున్నాయి, పెదవి చిట్లిపోయి ఉంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగిందని నటి తెలిపింది.
చర్మం ఊడివచ్చేలా..
జసీలా మాట్లాడుతూ.. 'నా కడుపులో రెండుసార్లు తన్నాడు. తన చేతి కడియంతో నా ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దానివల్ల నా చర్మం ఊడివచ్చింది. అతడు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడలేదు. నేను కాలు జారి కిందపడిపోవడం వల్లే ఈ గాయాలయ్యాయని చెప్తేనే ఆస్పత్రికి తీసుకెళ్తానన్నాడు. హాస్పిటల్ వెళ్లాక అదే అబద్ధం చెప్పాడు. డాక్టర్ నా ముఖంపై చీలిన చర్మాన్ని చూసి ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. కొన్ని రోజుల తర్వాత ధైర్యం కూడదీసుకుని జరిగిందంతా పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

అందవిహీనంగా మారిపోయా
శారీరక హింస, మానసిక వేదన అనుభవించాక నన్ను నేనే కోల్పోయినట్లుగా అనిపించింది. అందవిహీనంగా మారిపోయాను. అద్దంలో చూసుకోవడం కూడా మానేశాను. సరిగా తినలేకపోయాను, కంటినిండా నిద్రపోలేకపోయాను. దాదాపు పది కిలోలు తగ్గాను. అతడు మాత్రం హాయిగా నార్మల్ లైప్ గడుపుతున్నాడు. అసలేదీ జరగనట్లే ఉన్నాడు. కొంచెం కూడా బాధపడలేదు, నా గురించి ఆలోచించనేలేదు. కనీసం జరిగినదానికి క్షమాపణలు కూడా చెప్పలేదు.

సారీ చెప్తే వదిలేస్తానన్నా కూడా..
అతడికి చిట్టచివరగా ఓ ఛాన్స్ ఇచ్చి చూశాను. నాకు సారీ చెప్తే ఇంతటితో దీన్ని వదిలేస్తానన్నాను. కానీ అతడు క్షమాపణలు చెప్పడానికి బదులుగా కోర్టుకెళ్లి బెయిల్ తీసుకోవడానికే సుముఖత చూపించాడు. తనే ఏదీ జరగనట్లు ఉంటే నేను మాత్రం ఎందుకు కుమిలిపోతూ ఉండాలి. బాధపడుతూ కూర్చుంటే ఏదీ మారదు.. అందుకే ఇప్పుడిప్పుడే గతాన్ని మర్చిపోయి మళ్లీ మామూలు మనిషినయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అతడితో తెగదెంపులు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. జసీలా పర్వీన్.. మలయాళ సీరియల్స్‌లో నెగెటివ్ పాత్రలు పోషించింది.