జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. ప్రింట్‌ కోసం ఇంత కష్టపడ్డారా? | Jagadeka Veerudu Athiloka Sundari Latest Print Making Video Goes Viral | Sakshi
Sakshi News home page

Jagadeka Veerudu Athiloka Sundari: జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. ప్రింట్‌ కోసం ఇంత కష్టపడ్డారా?

May 5 2025 12:23 PM | Updated on May 5 2025 12:32 PM

Jagadeka Veerudu Athiloka Sundari Latest Print Making Video Goes Viral

జగదేకవీరుడు.. అతిలోకసుందరి టీవీల్లో ఎన్నిసార్లు చూసి ఉంటారో లెక్కేలేదు. ఈ సూపర్ హిట్ మూవీ ఎ‍ప్పుడు బుల్లితెరపై కనిపించినా పిల్లలతో పాటు పెద్దలు సైతం టీవీలకే అతుక్కుపోయేవారు. అలాంటి ఈ సినిమాను పెద్దతెరపై చూస్తే ఇంకెంత ఫీలింగ్‌ ఉంటుంది. ఆ కోరికను తీర్చేందుకే టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సిద్ధమైంది.

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిని రీ రిలీజ్‌ చేయనుంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అందుకే అదే తేదీకే ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఈ సినిమా గురించి నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, చిరంజీవి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్‌ ప్రింట్‌కు సంబంధించిన వైజయంతి మూవీస్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.

ఈ మూవీ ప్రింట్‌ అంతా పాడయిపోవడంతో మరో కాపీ కోసం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వెళ్లాల్సి వచ్చిందని నిర్మాత స్వప్నదత్ వెల్లడించారు. ఈ మూవీ రీల్‌ కోసం తాము చాలా కష్టపడ్డామని.. ప్రత్యేకంగా రిమైండర్‌ సెట్‌ చేసుకుని మెసేజ్ చూసుకునే వాళ్లమని తెలిపింది. చివరికీ 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి దగ్గర ఈ సినిమాకు సంబంధించిన ప్రింట్ దొరికిందని తెలిపారు. చాలా రోజులు కావడంతో అది కూడా అంతా దుమ్ము పట్టిపోయి ఉందని.. ఆ రీల్‌ అంతా పింక్‌ కలర్‌లో ఉందని అన్నారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో ఆ ప్రింట్‌ను 2డీ, 3డీలోకి మార్చినట్లు సాంకేతిక సిబ్బంది వెల్లడించారు.

కాగా.. ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement