
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). బాబు ఇంటికి వెళ్లి తనతో కబుర్లు చెప్పి, ఆడించి నవ్వించే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులోని బాబు తల బెలూన్‌లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని హైడ్రోసెఫాలస్ (Hydrocephalus) అని పిలుస్తారు.
అరుదైన వ్యాధి
ఈ వ్యాధి వచ్చిన శిశువుల తల అసాధారణంగా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితో ఓ బాలుడు బాధపడుతున్నాడని తెలిసి జాక్వెలిన్ చలించిపోయింది. వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి వెల్లడిస్తూ జాక్వెలిన్‌కు అభినందనలు తెలిపాడు. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి వస్తాడని ఆశిద్దామని పోస్ట్ పెట్టాడు.
మంచి మనసు
కాగా జాక్వెలిన్ పలు స్వచ్ఛంద సంస్థలకు సాయం చేస్తూ ఉంటుంది. మూగ జీవాల సంరక్షణ, పిల్లల చదువులు.. ఇలా అన్నింటికోసం పాటుపడుతూ ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని జనాల్లో అవగాహన కల్పించేందుకు క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జాక్వెలిన్.. వెల్‌కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
చదవండి: నీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా? రెచ్చిపోయిన మాస్క్‌మ్యాన్