
హారర్ సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను కాస్త భయపెట్టాలే కానీ.. ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే అన్నిభాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్‌లో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ వచ్చింది. అదే వెపన్స్. . జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ లాంటి స్టార్స్ నటించారు. ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం..తొలి రోజే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 23.5 కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చి సర్‌ప్రైజ్ చేసింది.
ఒకేసారి నాలుగు ఓటీటీల్లోకి..
ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సెప్టెంబర్ 9 నుంచి నాలుగు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు వీల్లేదు. ఓటీటీలో చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే. థియేటర్స్‌లోకి వెళ్లి చూసేంత సమయం లేని హారర్ ప్రియుల కోసం రెంట్ విధానంలో ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. థియేటర్స్‌లో బాగా ఆడుతున్న ఈ సినిమాను అప్పుడే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. ఓటీటీలోనూ అదే స్థాయి కలెక్షన్స్ రాబటితే ఇబ్బంది లేదు..కానీ ఏమాత్రం తేడా జరిగినా..అది మేకర్స్ స్వయంకృత అపరాధమే అవుతుంది.
వెపన్స్ కథేంటంటే..
ఇదొక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్. ఒక రోజు తెల్లవారుజామున 2:17 గంటలకు ఒకే క్లాస్‌కు చెందిన ఒక్క స్టూడెంట్ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు. వాళ్లు ఎలా వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? అనేది తెలుసుకోవడమే ఈ సినిమా కథ. రూ. 335 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది.