
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
ఆలోచన... ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్’(Bomb Movie Review). ఈ టైటిల్ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్ థ్రిల్లర్ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్‌తోపాటు విశాల్ వెంకట్ అందించిన ఈ కథను విశాల్ వెంకట్ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం.
కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా... రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి.
ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చనిపోతాడు. కదిరవన్‌నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చనిపోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చనిపోయిన కదిరవన్ శరీరం నుండి అపానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది.
ఇంతలో కదిరవన్ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చనిపోయిన కదిరవన్ శరీరం విడిపోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘బాంబ్’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీపావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీపావళి బాంబులతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్ టు వాచ్ ఫర్ దిస్ దివాలి.
– హరికృష్ణ ఇంటూరు