
కొన్ని ఆటలు చాలా ప్రమాదకరం. ఈ విషయం తెలిసినా సరే ఓసారి ఆడి చూస్తే పోలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులోనూ దెయ్యాన్ని చూడొచ్చు అనగానే ఓ పక్క ఎగ్జయిట్ అవుతూ, మరో పక్క భయపడుతూనే రంగంలోకి దిగుతారు. ఒక్క లైన్‌లో చెప్పాలంటే టాక్ టు మి సినిమా (Talk To Me Movie Review) కథ ఇదే! ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గర రాతి చేయి ఉంటుంది.
కథ
ఓ క్యాండిల్ వెలిగించి.. ఆ చేయిని పట్టుకుంటే చాలు దెయ్యాలు కనిపిస్తాయి. కనిపించడంతో ఆగవు. చేయి పట్టుకున్న వ్యక్తి శరీరంలోకి కూడా వెళ్తాయి. చేయిని వదిలేసి, క్యాండిల్ ఆర్పేసినప్పుడు ఆ దెయ్యం ఒంట్లో నుంచి తిరిగి వెళ్లిపోతుంది. దెయ్యం శరీరంలోకి చేరినప్పుడు ఎవరేం చేస్తున్నారనేది సరదాగా వీడియోలు షూట్ చేస్తూ ఉంటారు మిగతా ఫ్రెండ్స్. అప్పటివరకు వచ్చిన దెయ్యాలేవీ పెద్దగా భయపెట్టకపోవడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు. దీంతో చీకటి అంటేనే భయపడే ఓ బాలుడు కూడా ధైర్యం చేసి తనూ గేమ్ ఆడతానంటాడు.
అందుకు అతడి అక్క ఒప్పుకోదు. అప్పటికే ఆమె ప్రియుడి శరీరంలోకి దెయ్యం ప్రవేశించి చేసిన పిచ్చిపనిని చూసి ఆమె బిక్కచచ్చిపోతుంది. ఇదేమంత సరదా గేమ్ కాదని, ఇక ఆపేయమని వారిస్తుంది. అయినా పట్టించుకోకుండా చిన్నపిల్లాడితో గేమ్ ఆడిస్తారు. ఈసారి గేమ్ వైల్డ్‌గా మారుతుంది. అతడు తన కనుగుడ్లు పీకేసుకుంటాడు. తలను టేబుల్‌కేసి బాదుకుంటూ చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. రక్తం ఏరులై పారుతుండటంతో అందరూ భయంతో వణికిపోతారు.
ఎలా ఉంది?
దీంతో అందరూ ఎలాగోలా ఆ రాతి చేతి నుంచి బాలుడి చేతిని విడిపిస్తారు. తర్వాతేం జరిగిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! దెయ్యాన్ని ఆహ్వానించే ఆటలాడితే ఏం జరుగుతుందనేది చాలా సినిమాల్లో చూశాం. ఇది కూడా అలాంటిదే! కాకపోతే కథ ఎక్కడా దారితప్పకుండా స్పీడ్‌గా వెళ్లిపోతూ ఉంటుంది. అనవసరమైన సీన్లు ఉండవు. ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. అయితే మరీ ఎక్కువగా భయపెట్టే సన్నివేశాలు లేవు.
టాక్ టు మి.. ఆస్ట్రేలియన్ హారర్ మూవీ. 2023లో రిలీజైన ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. టాక్ టు మి 2 కథ ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. 'టాక్ టు మి' మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. దీనికి ఐఎమ్‌డీబీలో 7.1 రేటింగ్ ఉంది.