ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్‌..

Heroine Tabu Birthday Special Story - Sakshi

సౌత్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి స్టార్స్‌ అయిన వారిలో చాలా మంది ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ముంబైలో జెండా పాతినవారిలో శ్రీదేవి, జయప్రద మొదటి వరుసలో వస్తారు. కాని అంతే స్టార్‌డమ్‌ను, రెస్పెక్ట్‌ను సృష్టించుకున్న ఇంకో హీరోయిన్‌ను మన సౌత్‌ ఖాతాలో ఎవరూ వేయరు. ఆమె టబూ.. అసలు సిసలు తెలుగు అమ్మాయి. అందులోనూ హైదరాబాదీ అమ్మాయి. టబు బాలీవుడ్‌లో తన టాలెంట్‌ను చూపారు. ఇటు సౌత్‌లో అటు నార్త్‌లో ఒక వర్సటైల్‌ ఆర్టిస్ట్‌గా ప్రూవ్‌ చేసుకున్నారు. ఇవాళ తన బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..

అసలు పేరు తబస్సుమ్‌...
టబు అని అందరూ పిలుస్తారు గాని ఆమె అసలు పేరు తబస్సుమ్‌. పిలిస్తే తబు అని పిలవాలి. కాని టబు అని అలవాటైంది. ఆమె మదర్, ప్రసిద్ధ బాలీవుడ్‌ నటి షబానా ఆజ్మీ మదర్‌ దగ్గరి బంధువులు. షబానా ఆజ్మీకి టబూ మేనకోడలి వరుస. టెన్త్‌ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్న టబు ఇంటర్‌ నుంచి చదువు కోసం ముంబై వెళ్లింది. షబానా ఆజ్మీ వల్ల సినిమా వాతావరణం ఉండటంతో ముందు టబు అక్క పర్హా ఖాన్‌ హీరోయిన్‌ అయ్యారు. ఆ తర్వాత టబు కూడా సినిమా రంగ ప్రవేశం చేసింది. షబానా ఇంట్లో టబును చూసిన ప్రసిద్ధ నటుడు దేవ్‌ ఆనంద్‌ ఆమెకు హమ్‌ నౌజవాన్‌ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కాని కొత్త హీరోయిన్లను ఇంట్రడ్యూస్‌ చేయడానికి రెడీగా ఉండే మన నిర్మాత రామానాయుడు టబును కూలీ నంబర్‌ ఒన్‌  సినిమాతో తెలుగులోకి తీసుకు వచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్‌. టబు కూడా సూపర్‌ హిట్‌.

బాలీవుడ్‌లో కూడా విజయపథమే..
కూలీ నంబర్‌ ఒన్‌ తర్వాత టబు రేంజ్‌ పెరిగిపోయింది. అందరు హీరోలకు అందుబాటులో లేనంత స్థాయికి వెళ్లింది. ఆ టైమ్‌లోనే హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌తో చేసిన విజయ్‌పథ్‌ కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. అజయ్‌ దేవగణ్‌ ముంబైకు వచ్చినప్పటి నుంచి టబుకు క్లోజ్‌ ఫ్రెండ్‌. వాళ్లు ముంబైలో ఇరుగు పొరుగు ఉండేవారు. ఆ పరిచయం వల్లే విజయపథ్‌లో కలిసి నటించారు. హిట్‌ కొట్టారు. (చదవండి: మళ్లీ జంటగా...)

టబు-నాగ్‌ల స్నేహానికి నాంది..
ఈ లోపు తెలుగులో మాస్టర్‌ అఖిల్‌ హీరోగా సిసింద్రీ మొదలయ్యింది. నాగార్జున సొంత సినిమా కావడం వల్ల ఇందులో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది టబు. నాగార్జున టబుల సుదీర్ఘ స్నేహానికి ఈ సినిమా మొదటి మెట్టుగా నిలిచింది.

పండు అలియాస్‌ మహాలక్ష్మి.. 
కాని అసలు సిసలు మాయాజాలం, టబూజాలం తెలియజేసిన సినిమా నిన్నే పెళ్లాడుతా. హిందీలో కొత్త ఫ్యామిలీ స్టోరీ ట్రెండ్‌ను తీసుకొచ్చిన హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌ స్ఫూర్తితో రాసుకున్న ఈ కథలో మహాలక్ష్మి అలియాస్‌ పండుగా టబు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నాగార్జునను గ్రీకువీరుడిగా మోహించే అందాలరాశిగా ఆకర్షించారు. (చదవండి: ముచ్చటగా మూడోసారి)

ప్రేమదేశంతో సౌత్‌లో టాప్‌
కాని అదే సమయంలో దర్శకుడు కదిర్‌ తమిళంలో తీసిన కాదల్‌ దేశం టబును మొత్తం సౌత్‌కు పరిచయం చేసింది. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశం పేరుతో విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. టబులోని గ్రేస్‌ ఈ సినిమాలో కుర్రకారు వెర్రెత్తి చూశారు.

మేచిస్‌, అస్తిత్వతో మరో మెట్టు పైకి..
కాని టబు అంటే ఇలాంటి కేరెక్టర్లేనా? ఆమెలో నటిగా టాలెంట్‌ లేదా? ఉంది అని కనిపెట్టినవాడు దర్శకుడు గుల్జార్‌. అతడు తీసిన హిందీ సినిమా మేచిస్‌ టబులోని కొత్త నటిని లోకానికి వెల్లడి చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని మంచి కథలు రాయవచ్చని ఆ సినిమా రుజువు చేసింది. ఉగ్రవాదం నేపథ్యంలో నలిగే ఒక అమ్మాయి పాత్రలో టబు అద్భుత నటన ప్రదర్శించి ఎన్నో అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఆ తర్వాత నటుడు, దర్శకుడు సంజయ్‌ మంజ్రేకర్‌ తీసిన అస్తిత్వ సినిమా టబును నటనను మరో స్థాయికి తీసుకెళ్లారు. భర్త ఉండగా మరో పురుషుడితో సంబంధంలోకి వెళ్లే గృహిణి పాత్రలో టబు ఈ సినిమాలో నటించారు. స్త్రీల మానసిక ప్రపంచం గురించి భావోద్వేగాల గురించి ఈ సినిమాలో టబు చేసిన స్టేట్‌మెంట్‌ ఆ సమయంలో గొప్ప ఫెమినిస్టిక్‌ స్టేట్‌మెంట్‌గా విమర్శకులు వ్యాఖ్యానించారు.

ఉత్తమ నటిగా నిలబెట్టిన చాందిని బార్
ఆ తర్వాత ఫైనల్‌ టచ్‌గా మధుర్‌ భండార్కర్‌ తీసిన చాందిని బార్‌ టబును జాతీయ ఉత్తమ నటిగా నిలబెట్టింది. ముంబైలో పని చేసే బార్‌ డాన్సర్‌ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అటు ప్రేక్షకుల ఇటు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత టబు గొప్ప కథలకు ఒక ముఖ్యమైన ఎంపికగా నిలిచింది. హిందీలో సీరియస్‌ సినిమాలు చేస్తూనే తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పక్కన సినిమాలలో నటించింది టబు. చిరంజీవితో అందరివాడులో ఆమె చేసిన పాట ఎవరు మర్చిపోతారు. (చదవండి: హార్ట్‌ బీట్‌ని ఆపగలరు!)

అంధాదున్‌కి క్రిటిక్స్‌ కితాబు..
టబు ఇటీవల బాలీవుడ్‌లో అంధాధున్‌ సినిమాలో కీలకమైన పాత్ర చేసి బాలీవుడ్‌ను మరోసారి సర్‌ప్రైజ్‌ చేశారు. ఆమె చేయడం వల్లే ఆ క్యారెక్టర్‌ చాలా బాగా వచ్చిందని క్రిటిక్స్‌ కితాబు. మొన్నటి అల వైకుంఠపురములో టబు తాజా తెలుగు సినిమా. ఇక టబు పర్సనల్‌ లైఫ్‌లోకి వస్తే తను సింగిల్‌ ఉమన్‌గా ఉన్నారు. ఇంకా వివాహ బంధంలోకి వెళ్లలేదు. ఖాళీ దొరికితే సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరగడం ఆమెకు ఇష్టం. గొప్ప నటిగా గొప్ప సినిమాలు మరెన్ని చేస్తూ తను హ్యాపీగా ఉంటూ మనల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్‌ డే టుయూ వన్స్‌ అగైన్‌ టబు.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top