
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'.. థియేటర్లలో ఫ్లాప్ అయింది. సోషల్ మీడియాలో సీన్లపై బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి ట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ తేదీని సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు వదిలారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఈ సినిమా రానుంది? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం.
దాదాపు ఐదేళ్ల పాటు అష్టకష్టాలు పడి థియేటర్లలోకి వచ్చిన సినిమా 'హరిహర వీరమల్లు'. గత నెల 24న థియేటర్లలోకి వచ్చింది. అయితే అప్పుడు కూడా రిలీజ్ అవుతుందా లేదా అనుకున్నారు గానీ ఎలాగోలా విడుదలైంది. తొలి ఆట నుంచి నెగిటివ్ టాక్ రావడంతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలోకి రావడంపై గత కొన్నిరోజులుగా పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.
'హరిహర వీరమల్లు' సినిమాని 20వ తేదీ అంటే రేపటి(బుధవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ వదిలారు. మరి థియేటర్లలో వచ్చినప్పుడు అంతలా ట్రోల్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇంకెంత ట్రోల్స్‌కి గురవుతుందో ఏంటో?
'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. 16వ శతాబ్దంలో నదిలో కొట్టుకొచ్చిన ఓ పిల్లాడు ఓ అగ్రహారం వాసులకి దొరుకుతాడు. వాళ్లు ఆ బాలుడికి వీరమల్లు అని పేరు పెడతారు. పెద్దయ్యాక వజ్రాల దొంగ అవుతాడు. మచిలీపట్నంలో తాను చేసిన దొంగతనం గురించి విని దొర (శరత్ ఖేదేకర్).. ఓ వజ్రాల దొంగతనం కోసం తనని పిలిపిస్తాడు. ఆ దొర దగ్గర పంచమి (నిధి అగర్వాల్) ఉంటుంది. ఆమె వీరమల్లు ప్రేమలో పడుతుంది. వీరమల్లు కూడా ఆమెని ఇష్టపడతాడు.
దొర చెప్పిన వజ్రాలని దొంగిలించడంతో పాటు పంచమిని తీసుకెళ్లిపోయే క్రమంలో గోల్కండ నవాబుకి వీరమల్లు చిక్కుతాడు. ఆ నవాబు (దలిప్ తాహిల్) వీరమల్లుకి ఓ పని అప్పజెబుతాడు. కొల్లూరులో దొరికి అలా అలా చేతులు మారి ఔరంగజేబు దగ్గరకు చేరిన కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని. మరి వీరమల్లు ఆ వజ్రాన్ని తీసుకొచ్చాడా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
