
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), దీపికా పదుకొణెలపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నివాసి కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. షారుఖ్ , దీపికా(Deepika Padukone) ప్రమోట్ చేస్తున్న హ్యూందాయ్ కంపెనీకి చెందిన కారు కొనుగోలు చేసి తాను తీవ్రంగా నష్టపోయానని సింగ్ చెబుతున్నాడు.
కీర్తి సింగ్ చేసిన ఫిర్యాదు ఇలా ఉంది. 2022 జూన్ నెలలో హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ కారును సుమారు రూ. 24 లక్షలకు కొనుగోలు చేస్తే.. కేవలం ఆరు నెలల్లోనే కారు ఇంజన్‌లో పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నాడు. అధిక వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి తీవ్రమైన శబ్ధం వస్తుందని ఒక్కోసారి దారి మధ్యలోనే ఆగిపోతుందని తెలిపాడు. కారు సమస్య గురించి కంపెనీ ఏజెన్సీని సంప్రదించినప్పుడు, ఇది ఈ కారు మోడల్ తయారీ లోపమంటూ దాన్ని పరిష్కరించలేమని అక్కడి సిబ్బంది చెప్పినట్లు ఆయన పేర్కొన్నాడు. నిర్లక్ష్యంతో సమాధానం చెప్పడంతో తాను కోర్టును ఆశ్రయించానని తెలిపాడు. కానీ, తను చెబుతున్నట్లుగా హ్యుందాయ్ అల్కాజార్ కారు మోడల్ ఇంజన్‌లో ఎలాంటి లోపాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

హ్యూందాయ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్‌గా పనిచేస్తున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె ఈ ఘటనలో బాధ్యత వహించాలని ఆపై వారిద్దరి మీద కేసు నమోదుచేయాలంటూ భరత్‌పూర్‌లోని CJM కోర్టులో ఆయన పిటీషన్ దాఖలు చేశాడు. సెక్షన్ 420 (మోసం) ఇతర సంబంధిత సెక్షన్ల కింద FIR నమోదు చేయాలని మధుర గేట్ పోలీస్ స్టేషన్‌ను కోర్టు ఆదేశించింది. షారుఖ్ ఖాన్ 1998 నుండి ఆ కంపెనీ బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. దీపికా పదుకొణె డిసెంబర్ 2023 నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. 2024లో ఇద్దరూ కలిసి ఒక ప్రకటనలో కూడా కనిపించారు. తప్పుదారి పట్టించే ప్రకటనలకు సెలబ్రిటీలతో పాటు ఎండార్సర్లు కూడా బాధ్యత వహించాలని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే కంపెనీకి చెందిన ఆరుగురి సిబ్బందితో పాటు షారుఖ్, దీపికలపై కేసు నమోదైంది.