ఓ కుటుంబం బావుండాలన్నా, ఓ ఊరు బావుండాలన్నా లేదా దేశం బావుండాలన్నా,చదువుకుని ఉండాలి. నేటి సమాజంలో మనం సజావుగా బ్రతకాలి అంటే భాష ఏ విధంగా అవసరమో అదే విధంగా చదువు కూడా అంతే అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. కాని ఇప్పటి పరిస్థితులలో చదువుకునే వారు తక్కువయ్యారు చదువు కొనే వారు ఎక్కువయ్యారు. రాత్రింబవళ్ళూ కష్టపడి చదివి పరీక్ష రాస్తే, కష్టపడని కుట్రదారులు కొందరు దొడ్డిదారిన అసలైన వారి కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో అల్లుకున్న కథతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన సిరీస్ ఎగ్జామ్. ప్రైమ్ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ 7 భాగాలతో లభ్యమవుతోంది.
దాదాపుగా వాస్తవిక ఘటనలతో , చిన్నపాటి సినీ లిబర్టీతో ఓ నిజమైన సమస్యను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు దర్శకులు సర్కుణమ్.ఈ సిరీస్ మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
కథాంశానికొస్తే తమిళనాడు లోని తైకారా ప్రాంతానికి కొత్తగా ఎంపికైన డిఎస్ పి మారుమల్లి ఛార్జి తీసుకోవడానికి తన కారులో బయలుదేరుతుంది. దారిలో ఝాన్సీ మారుమల్లిని కిడ్నాప్ చేసి తైకారాకు తాను డిఎస్ పిగా వెళుతుంది. ఓ డిఎస్ పి స్థాయి వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ తన స్థానంలో వెళ్ళడమనేది సినిమా లిబర్టీ అనుకున్నా కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు.
కాకపోతే ఇక అక్కడి నుండి మెల్ల మెల్లగా కథలోకి తీసుకువెళతాడు దర్శకుడు. అసలు మారుమిల్లిని ఝాన్సీ ఎందుకు కిడ్నాప్ చేసింది, స్టేషన్ కి చేరుకున్న ఝాన్సీని ఎవరైనా గుర్తుపట్టారా లేదా అన్న అంశాలను మాత్రం సిరీస్ లోనే చూడాలి. ఈ సిరీస్ మొత్తం అయిపోయాక మన విద్య వ్యవస్థ లో ఉన్న చీకటి కోణాలు స్పష్టంగా అర్ధం అవుతాయి. ఒక దశలో ఏ ఎగ్జామ్ అయినా పాసవ్వాలా ఫెయిలవ్వాలా అన్నది తామిచ్చే పైసలమీదే ఆధారపడుతుందన్న విషయం తెలుస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరి చూసి తెలుసుకోవాల్సిన సిరీస్ ఇది. మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్.


