
‘కాంత’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. దుల్కర్ సల్మాన్, భాగ్య శ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా సముద్ర ఖని ఓ కీలక పాత్రలో నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లుగా గతంలో చిత్రయూనిట్ పేర్కొంది. కానీ ఆ తేదీకి విడుదల చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని గురువారం చిత్రయూనిట్ ఓ నోట్‌ను విడుదల చేసింది. ‘‘కాంత’ సినిమా టీజర్ విడుదలైనప్పట్నుంచి మీరు చూపించిన ప్రేమ, ఆ ప్యాయత, మద్దతు మా హృదయాలను హత్తుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మీకు మరింత మెరుగైన అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దృష్ట్యా విడుదలను వాయిదా వేశామని తెలియజేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని ‘కాంత’ చిత్రం యూనిట్ పేర్కొంది.