‘దృఢం’ రివ్యూ.. ఇదేం ట్విస్టులురా బాబు.. ఊహించడం కష్టం! | Dridam Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

OTT: ‘దృఢం’ రివ్యూ .. మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..?

Jun 13 2026 3:48 PM | Updated on Jun 13 2026 4:00 PM

Dridam Movie Review In Telugu

టైటిల్‌ : దృఢం
నటీనటులు: షేన్‌ నిగమ్‌, శోభి తిలకన్‌, కొట్టాయం రమేశ్‌, నందన్‌ ఉన్ని తదితరులు
దర్శకత్వం : మార్టిన్‌ జోసెఫ్‌
ఓటీటీ స్ట్రీమింగ్‌ వేదిక: జియో హాట్‌స్టార్‌

తమిళ, మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌కి ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది.థియేటర్స్‌లో సరిగా ఆడలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సాధించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతివారం ఓటీటీలో ఇలాంటి చిత్రాలు రిలీజ్‌ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ వారం కూడా ఓ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘దృఢం’. జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.


కథేంటంటే..
కుజినీలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పెద్దగా క్రైమ్‌ అనేదే జరగదు. పోలీసులంతా ఊరివాళ్లతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అలాంటి ప్రశాంతమైన స్టేషన్‌కి ఎస్సైగా వస్తాడు విజయ్‌(షేన్‌ నిగమ్‌). శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్సైగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందని తెలిసి ఎంతో సంతోషంగా ఉంటాడు. స్టేషన్‌లోని పోలీసులందరితో సరదాగా ఉంటూ తన డ్యూటీ తాను చేస్తుంటాడు. అయితే ఆయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే ఊరిలో గుర్తు తెలియని యువకుడి శవం బయటపడుతుంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగానే.. అదే ప్రాంతంలో ఉన్న ఫైనాన్స్‌ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. భారీ బంగారంతో పాటు రూ. 50 లక్షల నగదు కూడా దోచేస్తారు.

దీనిపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తుండగానే స్థానికంగా ఉన్న డ్యామ్‌లో మరో శవం బయటపడుతుంది. ప్రశాంతమైన ప్రాంతంలో ఇలా ఒక్కసారిగా వరుస హత్యలు, దోపిడీ జరుగుతుండడంతో ఉన్నతాధికారుల నుంచి విజయ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. వారంలో ఈ కేసులను ఛేదించాలని,లేదంటే ఆ బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తామని హెచ్చరిస్తారు. మరి ఈ కేసుని విజయ్‌ ఛేదించాడా? అసలు ఆ శవాలు ఎవరివి? ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఫైనాన్స్‌ కంపెనీలో దొంగతనం చేసిందెవరు? విచారణ క్రమంలో విజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
సాధారణంగా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ కథలు అన్ని దాదాపు ఒకేలా ఉంటాయి. క్రైమ్‌ జరగడం.. అది పోలీసులకు అది సవాలుగా మారడం..ఇన్వెస్టిగేషన్‌లో ట్విస్టులు బయటకు రావడం..ఇలా అన్ని కథలు ఇదే ఫార్మాట్‌లో సాగుతాయి. అయితే ఆ ఇన్వెస్టిగేషన్‌ ఎంత ఉత్కంఠంగా సాగింది? అదేదానిపైనే సినిమా ఫలితం ఆధారణ పడుతుంది. ‘అరే..ఇదేం ట్విస్టురా..అస్సలు ఊహించలేదు’ అని ప్రేక్షకుడు నోటితో అనిపిస్తే ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయినట్టే. ‘దృఢం’ సినిమా చూస్తే చివరిలో కచ్చితంగా మన నోట అలాంటి మాట వస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ని అస్సలు ఊహించలేరు. చివరిలో కొత్త క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్స్‌ చూశామనే ఫీలింగ్‌ కచ్చితంగా కలుగుతుంది.

సినిమా ప్రారంభ సన్నివేశాలు రొటీన్‌గానే ఉంటాయి. శిక్షణ పూర్తి చేసుకొని ఎస్సైగా కుజినీలం పోలీస్‌స్టేషన్‌కు రావడం..తోటి పోలీసులతో సరదగా కలిసి ఉండడం.. చిన్న చిన్న క్రైమ్‌ కేసులు వస్తే సాల్వ్‌ చేయడం.. దాదాపు అరగంట వరకు ఇలా సింపుల్‌గానే కథనం సాగుతుంది. ఎప్పుడైనే మొదటి శవం బయటపడుతుందో అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. 

ఒకవైపు గుర్తు తెలియని శవం ఎవరిదని విచారణ చేస్తుండగానే.. ఫైనాన్స్‌ కంపెనీతో దోపిడీ ఘటన బయటపడడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా వరుసగా క్రైమ్‌ జరగడంతో ఎస్సై విజయ్‌ ఈ కేసులను ఎలా ఛేదిస్తాడనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అసలు హత్యలు ఎవరు చేశారనేది ప్రేక్షకుడు కూడా అంచనా వేయలేడు. ప్రీ క్లైమాక్స్‌ నుంచి వచ్చే ట్విస్టులు అయితే అదిరిపోతాయి. హంతకులు ఎవరనేది తెలిసిన తర్వాత షాకవ్వడం ఖాయం. ప్రేక్షకుడు ఆ షాక్‌లో ఉండగానే మరో ట్విస్ట్‌ రివీల్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, యాక్షన్‌ సన్నివేశాలు థ్రిల్లింగ్‌కు గురి చేస్తాయి. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా, రొటీన్‌గా సాగినా.. సెకండాఫ్‌ మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే..
షేన్‌ నిగమ్‌ తప్ప మిగిలిన నటీనటులెవరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగానే ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్వాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement