హనుమంతుడిలా రామ్‌ చరణ్‌.. ‘పెద్ది’లో అదే పెద్ద మలుపు! | DOP Rathnavelu Talk About Peddi Movie | Sakshi
Sakshi News home page

'పెద్ది'లో అదే పెద్ద మలుపు.. యుద్ధంలా క్రికెట్‌ మ్యాచ్‌ : డీఓపీ రత్నవేలు

May 26 2026 9:25 PM | Updated on May 26 2026 9:26 PM

DOP Rathnavelu Talk About Peddi Movie

‘‘పెద్ది’లో నాకు అత్యంత కాంప్లికేటెడ్‌గా అనిపించింది క్రికెట్ మ్యాచ్. ఇది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా. కెమెరామెన్‌తో పాటు మొత్తం టీమ్ చాలా అవేర్‌గా ఉండాలి. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకం. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు.  రాత్రిపూట ఆ మ్యాచ్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. స్క్రీన్‌పై చూసినప్పుడు అది కేవలం క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అన్నారు  ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు. ఆయన సినిమాటోగ్రఫీ అందించిన తాజా చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జూన్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డీవోపీ రత్నవేలు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

బుచ్చిబాబు  ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ అని చెప్పారు. ఇప్పుడు విజయనగరం పూర్తిగా మోడ్రన్ అయిపోయింది. కానీ ఒకప్పటి విజయనగరానికి ప్రేక్షకులను తీసుకెళ్లాలి. అదంతా ఒక ఇమాజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకుని, ‘పెద్ది’ కథను ఎలా చెప్పాలి, విజువల్‌గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దానిపై చాలా పకడ్బందీగా వర్క్ చేశాం.

రంగస్థలం’లో గోల్డెన్ బ్రౌన్ టోన్ వాడాను. అది చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పటికీ చాలా మంది సినిమాటోగ్రాఫర్లు దాన్ని పీరియడ్ సినిమాలకు రిఫరెన్స్‌గా తీసుకుంటారు.  పెద్ది సినిమాకి వస్తే 40 సంవత్సరాల క్రితం విజయనగరంలో ప్రజలు ఒక కలర్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. అలాంటి ఫీలింగ్‌ను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాం. ప్రేక్షకులు మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు కనెక్ట్ అయ్యేలా ఒక మూడ్ క్రియేట్ చేశాం.

ఈ సినిమాలో కుస్తీ పోటీలు కూడా మరో పెద్ద ఛాలెంజ్. ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్, బాడీ మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇందులో రామ్ చరణ్ గారు కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్‌పై వర్క్ చేశారు. ప్రతి మజిల్‌ను డెవలప్ చేసి, ఒక రియల్ పహిల్వాన్‌లా కనిపించారు. మీరు టీజర్, ట్రైలర్‌లో చూస్తే ఆయన బాడీలోని ప్రతి మజిల్ కూడా చాలా డీటైల్‌గా కనిపిస్తుంది.

ఇందులో హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్‌లో ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. అది మీరు థియేటర్‌లో చూసినప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి. అందులో రామ్ చరణ్‌లో ఒక హనుమంతుడిని ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ‘రంగస్థలం’లో చిట్టిబాబు పాత్రను చూసినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆ పాత్రను దాటి బయటకు రారు. ‘పెద్ది’ పాత్ర విషయానికి వస్తే, చిట్టిబాబుకి, పెద్దికి ఎమోషనల్‌గా చాలా తేడా ఉంటుంది. రెండు పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా చాలెంజింగ్. ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదు. అది ప్రేక్షకులకు కన్నుల పండుగలా ఉంటుంది. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ హై కూడా ఉంటుంది. చివరి 30 నిమిషాలు సినిమా ప్రేక్షకులని కదిలిస్తుంది. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.

నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయ్యింది. ఏడాదికి ఒక సినిమానే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అదే సినిమా పూర్తయ్యే వరకు చేస్తాను. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చినా చేయలేదు. నాకు ఈ కథ చాలా నచ్చింది. చరణ్ గారు బుచ్చిబాబు అందరం ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశాం.

ఇందులో ఢిల్లీలో చిత్రీకరించిన పోర్షన్ నాకు చాలా ఫేవరెట్. అక్కడ నేను లైట్ లేకుండా షూట్ చేశాను. దాని కోసం ఫిల్మ్ నెగటివ్‌ను వాడాం. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఫిల్మ్ నెగటివ్‌ను ఉపయోగించాను. ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరాలు అద్భుతమైన ఔట్‌పుట్ ఇస్తున్నప్పటికీ, ఒక రియల్ ఫీల్ కోసం ఫిల్మ్ నెగటివ్ ఉపయోగించడం జరిగింది. అది జర్నీలో ఉన్న రియలిజం చూపించడానికి అది ఉయోగించాం.

శ్రీలంకలో షూటింగ్ కూడా స్పెషల్ ఎక్స్ పీరియన్స్. అక్కడో వాటర్‌ఫాల్ సీక్వెన్స్ ఉంది. అక్కడ ఇంతకు ముందు ఎవరూ షూట్ చేయలేదు. అది ఒక రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. మేము చాలా కష్టపడి ఆ ప్రదేశానికి వెళ్లాం. అక్కడ చూసిన రైల్వే ట్రాక్ మమ్మల్ని చాలా ఎగ్జైట్ చేసింది. అలాగే అక్కడ టన్నెల్ కూడా ఉంది. ఇందులో ట్రావెలింగ్ చేసే సీక్వెన్స్‌లు, కొండ ప్రాంతాలు, వాటర్‌ఫాల్స్, టన్నెల్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి.

నేను చేసే ప్రతి సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ఉంటాను. డీఐలో కూడా కూర్చుంటాను. ఇలాంటి పెద్ద సినిమాలు ఐమాక్స్‌లో విడుదలైతే ప్రేక్షకులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. అమెరికా, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. ఆ స్క్రీన్లలో ప్రేక్షకులు పొందే అనుభూతి కోసం నేను అంత కష్టపడుతుంటాను. ఈ సినిమా మల్టిపుల్ ఫార్మాట్స్‌లో విడుదల అవుతుంది. విజువల్ గా గ్రేట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

రెహమాన్ గారితో ఇది నాకు మూడో సినిమా. ఇంతకుముందు ‘రోబో’, ‘లింగా’ చిత్రాలకు కలిసి పని చేశాం. అంతకుముందు నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ‘బొంబాయి’ సినిమాకు కూడా పనిచేశాను. రెహమాన్ గారు జీనియస్. ఈ సినిమాకి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చారు. రీ-రికార్డింగ్ కూడా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.

నేను నా కెమెరాతో ఒక కథ చెప్పాలని ప్రయత్నిస్తాను. అలాగే రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి. ఒక డీవోపీకి మ్యూజిక్ సెన్స్, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి. అవి ఉన్నప్పుడు దర్శకుడికి చాలా హెల్ప్ అవుతుంది. బుచ్చిబాబు గారు నాకు ఈ సినిమా కోసం చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.  

ఈ సినిమాకి మా అబ్బాయి కూడా పని చేశాడు. తను కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకున్నాడు. నాలాగే తనకూ సినిమాపై చాలా ప్యాషన్ ఉంది. ‘పెద్ది’కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇందులో ఒక కుస్తీ ఫైట్ ఉంటుంది. అందులోని ఒక పోర్షన్‌ను తానే చాలా అద్భుతంగా షూట్ చేశాడు. తనకు కలర్ గ్రేడింగ్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. నాకు చాలా హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు డీవోపీగా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కథ కోసం చూస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement