 
													డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు చెప్పగానే 'హనుమాన్' సినిమా గుర్తొస్తుంది. అంతకు ముందు పలు చిత్రాలతో ఆకట్టుకున్నప్పటికీ ఈ మూవీ అద్భుతమైన హిట్ కావడం.. ఇతడి పేరుని పాన్ ఇండియా లెవల్లో మార్మోగిపోయేలా చేసింది. ఈ ఊపులో ప్రశాంత్ వర్మకు పలువురు బడా నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అవే ఇతడిని ఇబ్బందుల్లో పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమే ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది.
'హనుమాన్' రిలీజై ఇప్పటికి రెండేళ్లు అయింది. మధ్యలో ప్రశాంత్ వర్మ చేయాల్సిన రెండు సినిమాలు ఆగిపోయాయి. అందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో అనుకున్నది ఒకటి కాగా, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో అనుకున్న మూవీ మరొకటి. ఇవి ఆగినప్పటికీ ప్రశాంత్ వర్మ ఖాళీగా అయితే లేడు. తన సినిమాటిక్ యూనివర్స్‌లో 'మహాకాళి' తీస్తున్నాడు. దీనికి కేవలం దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా.. 'జై హనుమాన్'కి దర్శకత్వం వహించాల్సి ఉంది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ' డైరెక్టర్)
'హనుమాన్' హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మ.. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు బాగానే తీసుకున్నాడట. మీకే నెక్స్ట్ సినిమా చేసి పెడాతనని మాట కూడా ఇచ్చాడట. అలా రూ.80-100 కోట్ల వరకు అడ్వాన్సులు రూపంలో రాగా.. ఆ మొత్తంతో హైదరాబాద్‌లోని సొంతంగా ఓ స్టూడియోని నిర్మించుకున్నాడట. ఇప్పుడు అందరూ నిర్మాతలు, ప్రశాంత్ వర్మని కొత్త మూవీస్ గురించి అడిగేసరికి.. నేను స్టోరీ ఇస్తాను, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాను గానీ డైరెక్షన్ చేయనని అంటున్నాడట. దీంతో సదరు నిర్మాతలు.. ఇతడిపై ఫిర్యాదు చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్‌కి వెళ్లే ఆలోచనలో ఉన్నారట.
మరోవైపు డైరెక్టర్ ప‍్రశాంత్ వర్మకు తమ సంస్థ నుంచి ఎలాంటి అడ్వాన్సులు ఇవ్వలేదని, లావాదేవీలు జరపడం లాంటివి చేయలేదని 'ఓజీ' తీసిన డీవీవీ ఎంటర్ టైన్‌మెంట్స్ సంస్థ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటలు నిజమేనా అనే సందేహం కలుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై కచ్చితంగా మిగతా నిర్మాణ సంస్థలు కూడా స్పందించే అవకాశముందేమో! అప్పటివరకు వెయిట్ అండ్ సీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ ఫాంటసీ రొమాంటిక్ సినిమా)
— DVV Entertainment (@DVVMovies) October 31, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
