
‘‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన... ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన.. సరదాలే సరిగమలై పలికిన శుభవేళ’’ అంటూ సాగేపాట ‘షష్టిపూర్తి’(Shashtipoorthi) సినిమాలోనిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్లో రూపేష్, ఆకాంక్షా సింగ్ ప్రధానపాత్రధారులుగా నటించిన చిత్రం ఇది. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.
ఈ సినిమాలోని ‘వేయి వేణువుల నాదం మోగే...’పాటను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈపాటను కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆలపించారు. స్వర్ణ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. ఈపాట గురించి పవన్ ప్రభ మాట్లాడుతూ– ‘‘ఈపాటను చైతన్య ప్రసాద్ అద్భుతంగా రాశారు.
ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్నా ఈపాటను ప్లే చేసి తీరాల్సిందే. ఇళయరాజాగారు స్వరపరిచిన ఈ సినిమాపాటల రికార్డింగ్‌ని ప్రత్యక్షంగా వీక్షించి, పులకించిపోయామను. ఈపాట కోసం తోట తరణిగారు ఓ మండువా లోగిలిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్, అర్చనగార్లు, రూపేష్–ఆకాంక్ష ఈ ΄పాటలో జీవించారు. చాలా కాలం గుర్తుండిపోయేపాట ఇది’’ అని తెలిపారు.