
'హరిహర వీరమల్లు' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఎక్కడా కనిపించలేదు. సినిమాని మొదలుపెట్టి, చాలావరకు షూటింగ్ చేసింది ఈయనే. తర్వాత పలు కారణాల వల్ల తప్పుకొన్నాడు. మూవీ రిలీజ్ దగ్గరవుతున్నా క్రిష్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలో మాట అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో క్రిష్ ట్వీట్ చేశాడు.
(ఇదీ చదవండి: 'పుష్ప' ఘటన తరువాత మళ్లీ 'హరిహర..' కోసం బెనిఫిట్ షోలు)
అంతకు ముందు నిర్మాత ఏఎం రత్నం కావొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కావొచ్చు.. క్రిష్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే 'హరిహర వీరమల్లు' గురించి సరిగ్గా రిలీజ్‌కి రెండు రోజుల ముందు క్రిష్ ట్వీట్ చేశారు. 'ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా ఓ చరిత్ర పరిశోధకుడిగా, నమ్మలేని నిజాల్ని తవ్వితీసే సాధకుడిలా, ఓ ప్రపంచాన్ని నిర్మించాలన్న కలతో ముందగుడు వేసేవాడిగా, వినోదాన్ని, విజ్ఞానాన్ని సమకూర్చే సినిమా మీద నమ్మకం ఉన్నవాడిగా నాకో పెద్ద యుద్దాన్నే పరిచయం చేసింది' అని రాసుకొచ్చారు.
అలానే హీరో, నిర్మాతకు కూడా క్రిష్.. తన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వీళ్లిద్దరికి తప్పితే తన తర్వాత మిగిలిన పార్ట్ అంతా తీసిన జ్యోతికృష్ణకు గానీ, మిగిలిన టీమ్ గురించి గానీ క్రిష్ ఎక్కడా ప్రస్తావించలేదు. ఏదైతేనేం ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండటంతో క్రిష్, టీమ్ మధ్య ఏమైనా ఉందేమోనని అంతా అనుకున్నారు. ఇప్పుడు ట్వీట్ చేయడంతో అలాంటివేం లేవని ఓ క్లారిటీ వచ్చేసింది.
(ఇదీ చదవండి: Hari Hara Veera Mallu: మీడియా ప్రతినిధులపై పోలీసుల దురుసు ప్రవర్తన)