
‘‘అనుష్కకి దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన బలం ఏంటో మనందరికీ తెలుసు. తన చిత్రం బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు నిరూపించాయి. ‘అరుంధతి’ నుంచి ‘భాగమతి’ వరకు ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారామె. ‘ఘాటీ’ చిత్రంలో తనకి చాలా ఎగ్జయిటింగ్ క్యారెక్టర్ దొరికింది. మేమంతా నమ్మి, ఈప్రాజెక్ట్‌ని రాజీ పడకుండా రూపొందించాం. బిజినెస్ కూడా బాగుంది.
యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం’’ అని క్రిష్ జాగర్లమూడి తెలిపారు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు.
⇒ ‘వేదం’ సినిమా తర్వాత స్వీటీతో (అనుష్క) మరో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఆ చిత్రంలో సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలనే ఆలోచన కూడా జరిగింది. అయితే సహజంగా ఉండే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ‘ఘాటీ’ సరైనప్రాజెక్ట్ అనిపించింది. చింతకింది శ్రీనివాసరావు గొప్ప రచయిత. మా కంపెనీలో ‘అరేబియన్ కడలి’ అనే వెబ్ సిరీస్‌కి కథ, మాటలు రాశారాయన.
వేరే కథల గురించి చర్చించుకుంటున్నప్పుడు ‘ఘాటీ’ గురించి చె΄్పారు. ఆంధ్ర– ఒరిస్సా సరిహద్దులో శీలావతి అనే గంజాయి రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు... వారినే ఘాటీలు అని పిలుస్తారు. లొకేషన్స్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. అక్కడి వారి జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, సంస్కృతిని చూపించే ఆస్కారం ఉండటంతో ‘ఘాటీ’ మొదలుపెట్టాం.
⇒ ‘ఘాటీ’లో శీలావతి క్యారెక్టర్‌కి అనుష్క గ్రేస్, యాటిట్యూడ్ పర్ఫెక్ట్ యాప్ట్. ఈ చిత్రకథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సామాజిక సమస్య. దాని నిర్మూలనకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తోంది. దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్‌తో వస్తున్న సినిమా ‘ఘాటీ’. సామాజిక సమస్యల మీద ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఈ చిత్రం మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది.
ఇందులో చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి.
∙ఈ సినిమాలో దేశీరాజు పాత్రని రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభుగారిని ఊహించుకున్నాను. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర తనది. ఆయన అద్భుతంగా నటించారు. చైతన్యా రావు నటించిన ‘30 వెడ్స్ 20’ వెబ్ సిరీస్ నచ్చి, మా సినిమాలో విలన్ పాత్రకి తీసుకున్నాను. రవీంద్ర విజయ్ అద్భుతంగా నటించారు. రాజు సుందరం మాస్టర్ కూడా ఓ పాత్ర చేశారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబాగార్లు, యూవీ క్రియేషన్స్ విక్కీ–వంశీ–ప్రమోద్... కొత్త సినిమాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటారు. ‘ఘాటీ’ని చాలా ΄్యాషన్‌తో నిర్మించారు.
తూర్పు కనుమల్లోని పర్వత శ్రేణి, ప్రకృతి సౌందర్యాన్ని కెమెరామేన్ మనోజ్‌గారు బాగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ సంగీతం బాగుంటుంది... ప్రేక్షకులు చాలా కొత్త రకమైన సౌండ్‌ని అనుభూతి చెందుతారు. సాయి మాధవ్‌గారి మాటలు ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి. ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి దగ్గర చేసిన శిష్యరికం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల కలం విదిలించా (నవ్వుతూ).