నేను రవితేజకి అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని ‘మాస్ జాతర’ స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రవితేజ ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అన్నారు దర్శకుడు భాను భోగవరపు. ఆయన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ భాను భోగవరపు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ . ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ(Mass Jathara Movie) రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.
→ ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.
→ 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు.
→ ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.
→ రవితేజ(Ravi Teja)కు ఇది 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజకి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.
→ ఈ కథను రాసుకున్నప్పడే తులసి పాత్రకు శ్రీలీల(Sreeleea)ను తీసుకోవాలనుకున్నాను. , కథ వింటున్నప్పుడు హీరో, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నారు. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి-విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.
→ దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.
→ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.
→ రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.


