‘‘గాయపడ్డ సింహం’ మూవీ గురించి తరుణ్ భాస్కర్ చెప్పాడు. డైరెక్టర్ పవన్‌ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగితే.. టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని మా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై రిలీజ్ చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు.
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించారు. ఈ మూవీ విడుదల హక్కులను ‘దిల్’ రాజు కొనుగోలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ – ‘‘మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాం. అయితే ఏప్రిల్ 30కి ‘పెద్ది’ సినిమా వస్తే ‘గాయపడ్డ సింహం’ విడుదల తేదీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం పవన్‌గారు. నిర్మాతలు, జీ టీమ్ సపోర్ట్ చేశారు’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్ చేస్తున్న ‘దిల్’ రాజు గారికి ధన్యవాదాలు’’ అని భాను కిరణ్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తోంది. మా మూవీకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు కలిగితే విడుదల తేదీ మార్చుకుంటాం’’ అని పవన్ సాధినేని చెప్పారు.


