Gaayapadda Simham Movie
-
లేటెస్ట్ తెలుగు సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
ఈ వీకెండ్ థియేటర్లలోకి తెలుగులో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు. కమెడియన్ సత్య హీరోగా నటించిన 'జెట్లీ', దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ చేసిన 'గాయపడ్డ సింహం' చిత్రాలు.. ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంత వసూలు చేశాయి? వీటి కంటే ఒకరోజు ముందు రిలీజైన ధనుష్ 'కర' సంగతేంటి?(ఇదీ చదవండి: సత్య 'జెట్లీ' సినిమా రివ్యూ)కమెడియన్ సత్య, లీడ్ రోల్ చేసిన 'జెట్ లీ' చిత్రానికి రితేష్ రానా దర్శకుడు. ప్రమోషన్స్‌తో అయితే ఆకట్టుకున్నారు గానీ మూవీలో చెప్పుకోదగ్గ కామెడీ లేదు, అలానే స్టోరీ కూడా గందరగోళంగా ఉండటం లాంటివి మైనస్ అయ్యాయి. స్టార్స్ ఎవరూ లేకపోయినప్పటికీ ఉన్నంతలో బాగానే వసూలు చేసింది. తొలిరోజు రూ.1.30 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో ఓ సినిమాతో వచ్చిన తరుణ్ భాస్కర్.. మూడు నెలలు తిరిగేసరికల్లా 'గాయపడ్డ సింహం' అంటూ వచ్చాడు. ట్రంప్‌పై చేతబడి చేయడం అనే విచిత్రమైన స్టోరీ లైన్‌తో తీసిన ఈ మూవీలోనూ పెద్గగా చెప్పుకోదగ్గ కామెడీ లేదు. దీంతో దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే తొలిరోజు రూ.76 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం.(ఇదీ చదవండి: ‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇకపోతే గురువారం(ఏప్రిల్ 30) థియేటర్లలోకి వచ్చిన ధనుష్ 'కర' సినిమా సీరియస్‌గా సాగే డ్రామా. కొందరికి నచ్చగా మరికొందరికి నచ్చలేదు. అయితేనేం రెండు రోజుల్లో రూ.20.20 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 1990ల్లో రైతుల్ని బ్యాంక్‌లు లోన్స్ పేరు చెప్పి ఎలా మోసం చేసేవి అనే కల్పిత కథతో దీన్ని తెరకెక్కించారు.(ఇదీ చదవండి: ‘కర’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
‘గాయపడ్డ సింహం’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్ : గాయపడ్డ సింహంనటీనటులు: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, శుభలేఖ సుధాకర్, విష్ణు తదితరులునిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్సమర్పణ: పవన్ సాదినేనిసంగీతం: స్వీకర్ అగస్తీఎడిటర్: విప్లవ్ నిషాదంకథేంటంటే..దరహాస్(తరుణ్ భాస్కర్), గాయత్రి(మానసా చౌదరి) ప్రేమించుకుంటారు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని గాయత్రి తండ్రి కండీషన్ పెట్టడంతో.. దరహాస్ అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతాడు. వీసా తీసుకొని అమెరికాకి వెళ్లి.. 34 గంటల్లోనే తిరిగి వస్తాడు. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల వెనక్కి వచ్చిన (డిపోర్ట్) భారతీయ విద్యార్థుల్లో దరహాస్ ఒకడు. తనను అమెరికాకు వెళ్లకుండా చేసిన ట్రప్‌పై దరహాస్ పగపడతాడు. ఎలాగైన ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని స్నేహితులతో చెబుతాడు. దరహాస్ టార్చర్ భరించలేక ఫ్రెండ్ ఒక సలహా ఇస్తాడు. అదేంటి? ట్రంప్‌పై పగ తీర్చుకోవడం సాధ్యమేనా? దరహాస్ పగకు మాఫియా డాన్ బ్రూటల్ ధర్మ(జేడీ చక్రవర్తి)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో భైరవ దాస్(శ్రీవిష్ణు), శాలిని(ఫరియా అబ్దుల్లా) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి చేతబడి.. ప్రాక్టికల్‌గా ఇది అసంభవం. ఇలాంటి పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమే గాయపడ్డ సింహం. లైన్ వింటేనే నవ్వొస్తుంది. కథగా మలిస్తే ఎలా ఉండాలి? థియేటర్స్‌లో నవ్వులు వర్షం కురవాలి. కానీ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీ పండించడంలో పూర్తిగా సఫలం కాలేదు. చేతబడి కాన్సెప్ట్, బ్లాక్ బస్టర్ సినిమాల స్పూఫ్.. ఇవన్నీ సినిమాలో ఉన్నాయి కానీ..అవేవి పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అని పూర్తిగా బోర్ కొట్టించదు. కథ ఓకే కానీ..కథనం విషయంలోనే దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. బొమ్మరిల్లు, కేజీఎఫ్, అర్జున్ రెడ్డి, సలార్ లాంటి సినిమాల స్పూఫ్ సీన్లను మరింత బలంగా రాసుకోని ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. డ్రగ్స్ మాఫియాపై ఐజి విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) టీమ్ మెరుపు దాడులు చేసే సన్నివేశాలతో కథను సీరియస్‌గా ప్రారంభించాడు దర్శకుడు. ఆ వెంటనే ఫరియా, తరుణ్ భాస్కర్ల పెళ్లి చూపులు సీన్‌తో కథ కామెడీ వైపు టర్న్ తీసుకుంటుంది. ఇక దరహాస్‌తో తన తండ్రికి ముందే పరిచయం ఉందని శాలిని గ్రహించి.. నిజం చెప్పమని కోరడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. దరహాస్, గాయత్రి లవ్ స్టోరీని లైట్‌గా చూపించి..అమెరికాకు వెళ్లే ముందు హీరో ఇచ్చే బిల్డప్పులను హైలెట్ చేశాడు. అవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరో అమెరికా నుంచి తిరిగి వచ్చి.. పగతీర్చుకునేందుకు చేసే ప్రయత్నాల వరకు కథనం సోసోగానే నడుస్తుంది. ఎప్పుడైతే శ్రీవిష్ణు పాత్ర ఎంట్రీ ఇస్తుందో..అప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఎలాంటి సంబంధం లేని బ్రూటల్ ధర్మ పాత్రను ట్రంప్ చేతబడికి ముడిపెట్టిన విధానం బాగుంది. కానీ ఆయా సన్నివేశాలను మరింత కామెడీగా చూపించాల్సింది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. కథనం కొంతవరకు ఆసక్తికరంగా సాగుతుంది. బొమ్మరిల్లు, కేజీఎఫ్ సినిమాల స్పూఫ్ కొంతవరకు నవ్విస్తుంది. మిగతా సినిమాల స్పూఫ్ జస్ట్ ఓకే. ఇక ఆర్జీవీ, జేడీ చక్రవర్తిల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘సత్య’ మూవీకి ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. అయితే కథనం పూర్తిగా నెమ్మదించడంతో ముందుకు పోకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో శ్రివిష్ణు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే ‘గాయపడ్డ సింహం’ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది. కామెడీ ఆశించి వెళ్తే మాత్రం.. ప్రేక్షకుడి మనసు గాయపడక తప్పదు. ఎవరెలా చేశారంటే.. దరహాస్ పాత్రకు తరుణ్ భాస్కర్ న్యాయం చేశాడు. ఆయన అమాయకత్వం, డైలాగులు కీడాకోల సినిమాను గుర్తు చేస్తాయి. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి బాగానే చేశాయి. అయితే ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా అద్భుతంగా అయితే లేదు. ఫస్టాఫ్‌లో డాన్‌లా కనిపించే సన్నివేశాలు బాగున్నాయి కానీ.. కామెడీ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. తండ్రితో ప్లాష్‌బ్యాక్‌ని గంభీరంగా చెప్పించడం తప్ప ఫరియా అబ్దుల్లాకి పెద్దగా నటించే అవకాశం రాలేదు. శ్రీవిష్ణు తెరపై కనిపించేది కాసేపే అయినా.. సినిమాకు ఆయన పాత్రే ప్లస్ అని చెప్పాలి. సినిమా చూసిన వాళ్లకు భైరవ దాస్ పాత్ర గుర్తుండిపోతుంది. శుభలేఖ సుధాకర్, హర్ష, విష్ణుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. స్వీకర్ అగస్తీ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'గాయపడ్డ సింహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
గాయపడ్డ సింహం సంతృప్తి ఇస్తుంది: ఫరియా అబ్దుల్లా
‘‘గాయపడ్డ సింహం’ చిత్ర కథ వినగానే కొత్తగా అనిపించింది. కశ్యప్ శ్రీనివాస్‌గారు నా పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఇందులో ప్రతి పాత్రకి ప్రాధాన్యం ఉంటుంది. నేను చేసిన షాలిని పాత్రలో వినోదం ఎక్కువగా ఉంటుంది. మా మూవీ చూసిన ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే సంతృప్తి కలుగుతుంది’’ అని హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చెప్పారు.తరుణ్ భాస్కర్ హీరోగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా పంచుకున్న విశేషాలు.... ⇒ నేను ఏదైనా ఓ సినిమా ఒప్పుకోవాలంటే కథ, నా పాత్ర నచ్చాలి. ‘గాయపడ్డ సింహం’లో వ్లాగర్ షాలిని పాత్ర చేశాను. కశ్యప్ క్రియేట్ చేసిన యూనివర్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి. మా మూవీ ఫైనల్ ఔట్పుట్ చూశాను.. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. తరుణ్ భాస్కర్‌గారు సరదాగా ఉంటారు. ఆయన సెట్స్‌లో చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేది. ఈ మూవీలో శ్రీవిష్ణుగారి క్యారెక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ప్రేమికుడి చేయి వదిలేసిన అమ్మాయిగా మానసా చౌదరి చేస్తే.. ఆ చేతిని పట్టుకునే అమ్మాయి పాత్ర నాది (నవ్వుతూ).⇒ ‘గాయపడ్డ సింహం’ లో యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను కలిపి హిలేరియస్‌గా తెరకెక్కించారు కశ్యప్ శ్రీనివాస్‌గారు. స్వీకర్ అగస్తి చాలా అందమైన సంగీతం ఇచ్చారు. ‘బ్రైడ్...’, ‘జింగాల...’ నాకు ఇష్టమైన పాటలు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు ఉన్నారు.. అందరూ చాలా క్రియేటివ్‌గా ఆలోచించే వారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తిగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. దుల్కర్ సల్మాన్గారి సినిమాలో అతిథి పాత్ర వస్తే చేయాలనుకోవడం లేదు. పూర్తి స్థాయి నిడివి ఉండే పాత్ర చేయాలని ఉంది. వచ్చే ఏడాది నేను ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తాను.. కొన్ని కథలు రాస్తున్నాను. ప్రస్తుతం ‘భగవంతుడు’, ‘సిగ్మా’ సినిమాలు పూర్తి చేశాను. సత్యదేవ్గారితో ఓ మూవీ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. -
విష్ణుప్రియతో రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి
యాంకర్ విష్ణుప్రియకు జేడీ చక్రవర్తి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో చాన్స్ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని కూడా ఆమె చెప్పింది. అప్పటి నుంచి జేడీ, విష్ణుప్రియల పెళ్లిపై రకరకాల రూమర్స్ వచ్చాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ పుకార్లపై జేడీ చక్రవర్తి స్పందించాడు. ఆయన కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా ఫరియా అబ్ధుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ సందర్భంగా యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్‌పై యాంకర్ ప్రశ్నించగా.. జేడీ చక్రవర్తి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘విష్ణుప్రియ గురించి నేను ఒక విషయం చెబుతా. నేను నటుడిగానే కాకుండా నాకు మరో కోణం ఉంది. అదే ఫిలాసఫి. దానిపరంగా విష్ణుప్రియ నా శిష్యురాలు. విష్ణుప్రియకు నేను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుంది. అసలు ఆ అమ్మాయికి నాకు ఎఫైర్ ఉందని అనుకోవడం అన్నంత దుర్మార్గం ఇంకోకటి లేదు. ఆమె నా శిష్యురాలు... పైగా పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తోంది. అలాంటి అమ్మాయితో నా పెళ్లి ముడిపెట్టడం సరికాదు’ అని జేడీ చెప్పుకొచ్చాడు.ఇక విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు ఫిలాసఫికల్‌గా మాత్రమే శిష్యురాలు.తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌తో నాకు ఏ సంబంధం లేదు. తన ఇష్టం తనది.. తను నాతో డిస్కష్ చేసేది ఫిలాసఫి. విపరీతమైన దైవభక్తి, విపరీతమైన జ్ఞానం ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఫిలాసఫి వేరు, దేవుడు వేరు. ఫిలాసఫికి సంబంధించిన విషయాలకే తను నాకు ఫోన్ చేసి కన్సల్ట్ అవుతుంది. దాని మీద మాత్రమే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నేను విష్ణుప్రియని కలిసి దాదాపు మూడేళ్లు అవుతోంది అని జేడీ చక్రవర్తి తెలిపారు. -
'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ట్రంప్ మీద రివేంజ్ ఏంట్రా? ఫన్నీగా ట్రైలర్
ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్.. చాన్నాళ్ల నుంచి నటుడిగానే కనిపిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీతో వచ్చాడు గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరో మూవీతో వచ్చేశాడు. అదే 'గాయపడ్డ సింహం'. మే 01న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తగ్గిపోయిన సినిమాల 'లైఫ్'.. ఎవరు దీనికి కారణం?)ట్రైలర్ విషయానికొస్తే.. అమెరికా వెళ్లి సెటిలైపోవాలని ఆశపడ్డ హీరోని ట్రంప్, తిరిగి స్వదేశానికి పంపిస్తాడు. దీంతో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్సవుతాడు. ఈ క్రమంలోనే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? జేడీ చక్రవర్తి తదితరుల పాత్రలేంటి అనేది మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగ నటించగా.. హీరో శ్రీ విష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నాడు.ట్రైలర్ అయితే కామెడీ, థ్రిల్లింగ్‌గా బాగానే ఉంది. కానీ ఐపీఎల్, వేసవిని తట్టుకుని ఈ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి? దీంతో పాటు మే 01న కమెడియన్ సత్య హీరోగా చేసిన 'జెట్ లీ', ధనుష్ 'కర' చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి.(ఇదీ చదవండి: చిరంజీవికి కావాలి ఓ నిర్మాత?) -
ఆ అదృష్టం నాకు దక్కింది: జేడీ చక్రవర్తి
‘‘యాక్టర్స్ అందరికీ కమల్ హాసన్‌గారు ఒక కొలమానం. ఆయన చేసినన్ని క్యారెక్టర్లు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చేయలేదు, చేయబోరు. అయితే ‘గాయపడ్డ సింహం’ మూవీలో నేను పోషించిన ధర్మ పాత్ర నా కెరీర్లో గుర్తుండి పోతుంది. నటుడిగా కాదు కానీ, క్యారెక్టర్ పరంగా చూస్తే ధర్మలాంటి పాత్ర చేసే అదృష్టం కమల్ హాసన్‌గారికి దక్కలేదు.. ఆ అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నాను’’ అని నటుడు జేడీ చక్రవర్తి తెలిపారు. తరుణ్ భాస్కర్ హీరోగా, మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’.డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో స΄్తాశ్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదలవుతోంది. ఈ మూవీలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పోషించిన బ్రూటల్ ధర్మ పాత్రని పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ‘మనీ, సత్య, అనగనగా ఒక రోజు’ లాంటి చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం ‘గాయపడ్డ సింహం’లో దొరికింది. మా సినిమా ‘దిల్’ రాజు గారికి నచ్చడం సంతోషం. మా మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు’’ అని పేర్కొన్నారు.‘‘మా సినిమాని మేము ఎంత ఎంజాయ్ చేశామో, ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు పవన్ సాధినేని. ‘‘జేడీగారి బెస్ట్ సినిమాల్లో మనకు నచ్చిన అన్ని ఎలిమెంట్స్ ధర్మ పాత్రలో కనిపిస్తాయి’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘జేడీ చక్రవర్తిగారు సత్య పాత్రతో ఎంత పాపులర్ అయ్యారో ధర్మ క్యారెక్టర్లోనూ అంతే పాపులర్ అవుతారని నమ్ముతున్నాను’’ అని భాను కిరణ్ ప్రతాప చె ప్పారు. -
‘పెద్ది’ వస్తే.. ‘గాయపడ్డ సింహం’ వాయిదా వేస్తాం : దిల్ రాజు
‘‘గాయపడ్డ సింహం’ మూవీ గురించి తరుణ్ భాస్కర్ చెప్పాడు. డైరెక్టర్ పవన్‌ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగితే.. టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని మా శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై రిలీజ్ చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ పవన్ సాధినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కల్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్ నిర్మించారు. ఈ మూవీ విడుదల హక్కులను ‘దిల్’ రాజు కొనుగోలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ – ‘‘మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించాం. అయితే ఏప్రిల్ 30కి ‘పెద్ది’ సినిమా వస్తే ‘గాయపడ్డ సింహం’ విడుదల తేదీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా కోసం పవన్‌గారు. నిర్మాతలు, జీ టీమ్ సపోర్ట్ చేశారు’’ అన్నారు కశ్యప్ శ్రీనివాస్. ‘‘మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్‌ని సపోర్ట్ చేస్తున్న ‘దిల్’ రాజు గారికి ధన్యవాదాలు’’ అని భాను కిరణ్ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తోంది. మా మూవీకి థియేటర్స్ విషయంలో ఇబ్బందులు కలిగితే విడుదల తేదీ మార్చుకుంటాం’’ అని పవన్ సాధినేని చెప్పారు.


