ధురంధర్‌: ది రివెంజ్‌ @ 1622 కోట్లు | Dhurandhar: The Revenge has achieved a massive Rs 1622 crore worldwide | Sakshi
Sakshi News home page

ధురంధర్‌: ది రివెంజ్‌ @ 1622 కోట్లు

Apr 7 2026 12:13 AM | Updated on Apr 7 2026 11:59 AM

Dhurandhar: The Revenge has achieved a massive Rs 1622 crore worldwide

‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ నిలిచింది. రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యధర్‌ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘ధురంధర్‌’. ఆర్‌. మాధవన్, అర్జున్‌ రాంపాల్, సంజయ్‌ దత్, సారా అర్జున్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్‌ పతాకాలపై ఆదిత్యధర్, జ్యోతిదేశ్‌ పాండే, లోకేష్‌ థర్‌ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా (ధురంధర్, ధురంధర్‌: ది రివెంజ్‌) విడుదలైంది.

గత ఏడాది డిసెంబరు 5న విడుదలైన ‘ధురంధర్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్ల రూపాయల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ ఏడాది మార్చి 19న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1622 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టిందని యూనిట్‌ పేర్కొంది. ఇండియాలో రూ.1228 కోట్లు, ఓవర్సీలో రూ.394 కోట్లు తమ సినిమాకు వచ్చాయని ‘ఎక్స్‌’ వేదికగా జియో స్టూడియోస్‌ సంస్థ తెలిపింది.

ఇండియాలో రూ.1041 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వచ్చాయని, ఇక్కడ వెయ్యికోట్ల రూపాయల నెట్‌ వసూళ్లు సాధించిన రికార్డును ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ క్రియేట్‌ చేసిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇటీవలే నార్త్‌ అమెరికాలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వసూళ్ల రికార్డును అధిగమించిన ‘ధురంధర్‌: ది రివెంజ్‌’ సినిమా తాజాగా నార్త్‌ అమెరికాలో పాతిక మిలియన్‌ డాలర్లు(దాదాపు 232 కోట్లు) సాధించి, అక్కడ అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన తొలి ఇండియన్‌ సినిమాగా నిలిచిందని మేకర్స్‌ పేర్కొన్నారు. అలాగే జర్మనీ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా వన్‌ మిలియన్‌ యూరోలు సాధించి సత్తా చాటింది.

Advertisement
 
Advertisement
Advertisement