
ప్రతిభ ఉంటే చాలు ఎలాంటి రంగంలోనైనా సరే రాణించవచ్చని జాతీయ నటుడు ధనుష్ నిరూపించాడు. చూడగానే ఆకట్టుకునే రంగు అతనిలో లేదు. అందుకే మొదటి సినిమాతోనే తీవ్రంగా ట్రోలింగ్కు గురయ్యాడు. ఆకర్షించే కటౌట్ అతనిది కాదు. అయితే ఏంటి..?, ఓటమి సమయంలో ఎలా నిలబడాలో తనకు తెలుసు. అసలు నటనంటే ఏంటో తెలీదు. కానీ, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. ధనుష్ బలం ఏంటో మొదట గుర్తించింది తన తండ్రే.. నేడు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వెంకటేష్ ప్రభు కస్తూరిరాజా ఎవరు..? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు తక్కువ. అది ఆయన స్క్రీన్‌నేమ్. చెఫ్ కావాలని ధనుష్ కోరుకున్నాడు. కానీ, తండ్రి కస్తూరి రాజాకు మాత్రం కుమారుడిని హీరో చేయాలని బలమైన కోరిక ఉంది. దీంతో తండ్రి మాటను కాదనలేక 'తుల్లువదో ఇలమై' (Thulluvadho Ilamai) సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10న విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, హీరో ఏంటి ఇలా ఉన్నాడంటూ ధనుష్పై విమర్శలు వచ్చాయి. కేవలం కథలో బలం ఉంది కాబట్టి సినిమా ఆడిందని ధనుష్కు ఎంతమాత్రం నటన రాదంటూ విమర్శించారు. అయితే, తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టాలని ఆయన బలంగా ముందుకు సాగాడు. ఎక్కడ మాటల పడ్డాడో అక్కడే తనను మెచ్చుకునేలా నిలబడాలని రెండో సినిమాపై గురి పెట్టాడు.

ధనుష్ నటించిన రెండో సినిమా 'కాదల్ కొండెయిన్'.. తన అన్నయ్య సెల్వ రాఘవన్ తెరకెక్కించాడు. ఈ సినిమా కోలీవుడ్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ధనుష్ నటనకు తమిళ ప్రజలు ఫిదా అయ్యారు. మొదటి సినిమాను విమర్శించిన వారే ధనుష్ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ విజయం వెనుక ధనుష్ అన్నయ్య సెల్వ రాఘవన్ శ్రమ ఎక్కువ ఉంది. ధునుష్ నుంచి మంచి నటనని రాబట్టుకునేందుకు ఒక్కోసారి ధనుష్‌ని రాఘవన్ కొట్టేవారట. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పారు. అన్నయ్య వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ పలుమార్లు ఆయన పంచుకున్నారు. ఇదే చిత్రాన్ని అల్లరి నరేశ్ హీరోగా తెలుగులో ‘నేను’గా తెరకెక్కించారు.
వరుసగా రెండు విజయాలు దక్కడంతో ధనుష్ పేరు వైరల్ అయిపోయింది. కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్‌లోనూ ఛాన్సులు దక్కించుకున్నారు. బాలీవుడ్లో రంజనా, షబితాబ్ వంటి సినిమాలతో ప్రశంసలు అందుకున్నారు. ఆపై హాలీవుడ్లో 'ది ఎక్ట్స్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'తో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు వారికి 'రఘువరన్ బీటెక్' డబ్బింగ్ మూవీతో గుర్తింపు పొందారు. ఇలా అంతర్జాతీయ స్థాయికి ధనుష్ చేరుకున్నారు. టాలీవుడ్లో ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల ఏకంగా సార్, కుబేర వంటి డైరెక్ట్ చిత్రాలతో తెలుగులో నటించారు. ధనుష్ అంటే కేవలం నటుడు మాత్రమే అనకుంటే పొరపాటే.. ఆయనలో దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయిత, కథా రచయిత కూడా.. ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ‘వై దిస్ కొలవెరి’ పాటను కేవలం ఐదు నిమిషాల్లో రాశారు.
కొత్త చరిత్రను లిఖించిన ధనుష్
ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు . సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను ధనుష్ లిఖించాడు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ (అసురన్) ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.

ధనుష్ పిల్లల పేర్లు 'యాత్ర- లింగ' వెనుక స్టోరీ
ధనుష్ రెండో సినిమా విడుదల సమయంలో ఐశ్వర్య (రజనీకాంత్ కుమార్తె)తో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంలో ధనుష్‌ని ఆమె ఇంటర్య్వూ చేశారు. అక్కడి నుంచి మొదలైన పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. అయితే, కొంత కాలం క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు కావడంతో తన పిల్లలకు లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. షూటింగుల నుంచి కాస్త తీరిక దొరికినప్పుడల్లా ఆయన ఎక్కువ శైవక్షేత్రాలకు వెళ్తుంటారు. తనను నడిపించేది శివయ్యే అంటూ ఆయన పలుమార్లు చెప్పుకున్నారు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ఆలయాలకు తరుచూ వెళ్లడం ఆయనకు ఇష్టం. చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేసినట్లు ధనుష్ చెప్పారు. అలాగే తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా - మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికీ ఆయన వెళ్లడం విశేషం.