భర్తతో విడాకులు.. అందుకే భరణం వదులుకున్నా: బుల్లితెర నటి | Delnaaz Irani gets real about her divorce from Rajev Paul | Sakshi
Sakshi News home page

భర్తతో విడాకులు.. భరణం కంటే అదే ముఖ్యం: బుల్లితెర నటి

Apr 10 2026 8:02 PM | Updated on Apr 10 2026 10:16 PM

Delnaaz Irani gets real about her divorce from Rajev Paul

ప్రముఖ బాలీవుడ్ నటి డెల్నాజ్ ఇరానీ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు మూవీస్‌లో మెప్పించిన నటి వైవాహిక బంధం, విడాకులపై నోరు విప్పారు. తన భర్త రాజీవ్‌ పాల్‌తో విడాకుల సమయంలో తాను భరణం కంటే మనశ్శాంతికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తనకు డివోర్స్ తర్వాత ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆమె వెల్లడించారు. తాజాగా 'ది మేల్ ఫెమినిస్ట్' కార్యక్రమానికి హాజరైన ఈ విషయాన్ని పంచుకున్నారు.

తన విడాకుల వ్యవహారం చాలా కష్టంగా సాగిందని డెల్నాజ్ ఇరానీ తెలిపారు. పార్సీ కుటుంబం నుంచి వచ్చిన తాను మొదట్లో విడిపోవాలని అస్సలు అనుకోలేదని చెప్పింది. ఆ తర్వాత ఒకరినొకరు తేలికగా తీసుకోవడంతోనే మా బంధం విచ్ఛిన్నమైందని పంచుకుంది. వ్యక్తిగత సవాళ్ల వల్ల నా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందన్నారు. అదే సమయంలో నా తండ్రి గుండెపోటుకు గురై మరుసటి ఏడాదే మరణించారని తెలిపింది.

మాలో ఒకరు విడాకుల కోసం ఒత్తిడి చేయగా.. మరొకరు పూర్తిగా సిద్ధంగా లేరని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ నేను ఎలాంటి భరణం కోరకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని వెల్లడించింది. వివాదాల కంటే శాంతినే కోరుకున్నా.. స్వతంత్రంగా తన జీవితాన్ని మళ్లీ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నానని ఆమె స్పష్టం చేశారు.

కాగా.. డెల్నాజ్, రాజీవ్ 1993లో 'పరివర్తన్' సీరియల్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దశాబ్దానికి పైగా సాగిన తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ 2010లో వారు విడిపోతున్నట్లు ప్రకటించారు. 2012లో ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకులు తీసుకున్న కొద్దికాలానికే ఇద్దరు కలిసి బిగ్ బాస్ షోలో కనిపించారు. ప్రస్తుతం నటి డెల్నాజ్.. డీజే పెర్సీ కర్కారియా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు.  ఇటీవలే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement