
‘‘పద్దెనిమిది సంవత్సరాల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుక్ ఖాన్ నాకు కొన్ని పాఠాలు నేర్పారు. ఓ సినిమా మేకింగ్, ఆ సినిమా నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఆ సినిమాలో ఎవరితో కలిసి నటించాం అనే అంశాలు ఆ సినిమా విజయాని కన్నా ముఖ్యమైనవి అని ఆయన చె΄్పారు. షారుక్ నాకు నేర్పిన తొలి పాఠం ఇదే. అప్పట్నుంచి నేను తీసుకునే నిర్ణయాలకు ఈ పాఠాన్నే అమలు చేస్తున్నాను. షారుక్‌తో ఆరోసారి సినిమా చేస్తుండటానికి ఈ పాఠమే కారణమై ఉండొచ్చు’’ అని తన తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో దీపికా పదుకోన్ పేర్కొన్నారు.
షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, షారుక్ తనయ సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ‘కింగ్’ సినిమా షూటింగ్‌లోకి తాను అడుగుపెట్టినట్లుగా స్పష్టం చేస్తూ దీపికా పదుకోన్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోల్యాండ్‌లో జరుగుతోందని, ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులకు పైనే ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇక ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్’ చిత్రాల్లో షారుక్–దీపిక హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా ‘కింగ్’ సినిమా కోసం ఈ ఇద్దరు ఆరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ‘కల్కి 2’ చిత్రంలో దీపిక నటించడం లేదని ఆ చిత్రం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.