రాజకీయాల్లో మాత్రమే కాదు ఏ రంగంలోనైనా హత్యలు కావు ఆత్మహత్యలే ఉంటాయేమో అనిపిస్తుంది ఆ దర్శకుడ్ని చూస్తే... అవును మరి దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్లు అంటే చిన్న విషయం కాదు. అలాంటి సినిమా ఇచ్చిన తర్వాత ఆ దర్శకుడి ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టాలి. పెద్ద పెద్ద బేనర్లు బారులు తీరాలి. కానీ విచిత్రంగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj ) విషయంలో ఇది రివర్స్ అయింది. సినిమా రంగంలో పదేళ్ల కెరీర్‌లోనే తీసిన తక్కువ సినిమాల్లోనే 3 బ్లాక్ బస్టర్స్ అది కూడా దాదాపుగా రూ.600 కోట్లు కలెక్షన్లు ఇచ్చిన దర్శకుడు బహుశా దక్షిణాదిలోనే మరొకరు లేరేమో. అందుకే కూలీ(Coolie) విడుదల ముందు వరకు రాజమౌళి రేంజ్ లో హైప్ అందుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్, అయితే కేవలం ఒక్క సినిమా మొత్తం అతని పరిస్థితిని తలకిందులు చేసేసింది.
(చదవండి: ప్రశాంత్ వర్మ మోసం రూ.200 కోట్లు.. నిర్మాత ఫిర్యాదు)
వందల కోట్ల గ్రాస్ వసూలు చేసినా, ఉన్న భారీ తారాగణంతో పోల్చుకుంటూ వేసిన అంచనాలు అందుకోలేకపోయింది. చివరకు కమర్షియల్ లెక్కల్లో అపజయాల లిస్టులోకి చేరిపోయింది. అయినప్పటికీ కూడా ఆ కలెక్షన్లు సాధారణమైనవేమీ కాదు.. మరీ ఒక దర్శకుడి పేరు చెబితేనే భయపడేంత దారుణమైన ఫ్లాప్ కూడా కాదు. అయినా సరే ప్రస్తుతం లోకేష్ పరిస్థితి మాత్రం అలాగే ఉంది.
రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబో మల్టీస్టారర్ ను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మొదలు కావల్సి ఉంది. కానీ కూలీ దెబ్బకు ఆ ఛాన్స్ ని నెల్సన్ దిలీప్ కుమార్ దక్కించుకున్నాడని అంటున్నారు. అలాగే కూలీ తర్వాత ఇంకో సినిమా చేద్దామని లోకేష్ తో చెప్పిన రజని ఆ ఆలోచనను విరమించుకున్నాడని సమాచారం.
(చదవండి: ఎంతోమంది కళ్లు తెరిపించే మూవీ.. 'తలవర' రివ్యూ)
ఇదంతా ఒకెత్తయితే అమీర్ ఖాన్ తో తీద్దామని ప్లాన్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ కూడా ఆగిపోవడం లోకేష్ కనగరాజ్‌కు కలిగిన నష్టాన్ని పతాక స్థాయికి చేర్చింది. కూలీకి ముందు వినపడినా, ఇప్పుడు ఎక్కడా దాని గురించి ప్రస్తావనే వినిపించడం లేదు. మరోవైపు కార్తీ హీరోగా ఖైదీ 2ని సైతం లోకేష్ వెంటనే మొదలుపెట్టే పరిస్థితిలో లేడట. బడ్జెట్ డిమాండ్ చేస్తున్న మొత్తాన్ని భరించే స్థితిలో నిర్మాత లేకపోవడమే దానికి కారణమంటున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ – ప్రభాస్ కలయికలో లోకేష్ కనగరాజ్ ఒక గ్యాంగ్ స్టార్ డ్రామా తెరకెక్కిస్తాడనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నా ఇందులో నిజం లేదని సమాచారం.
ప్రభాస్ కి ఉన్న కమిట్ మెంట్స్ చూస్తే ఇప్పటికిప్పుడు మల్టీస్టారర్లు చేసే పరిస్థితిలో లేడు. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు కరెక్ట్ టైమ్‌కి పూర్తయితే అదే గొప్ప అని చెప్పాలి. ప్రస్తుత వెనుకడుగు పరిస్థితుల్లో లోకేష్ పేరుని వార్తల్లో ఉంచడం కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని కూడా టాక్.
సరే ఫ్లాపులు అందరికీ వస్తాయి కానీ ఒక అబోవ్ యావరేజ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ కి ప్రస్తుతం వచ్చిన పరిస్థితి మాత్రం ఆలోచింపజేసేదే. ఈ సినిమా రిజల్ట్ కన్నా ఈ సినిమా విడుదల తర్వాత వచ్చిన సమీక్షలు, విమర్శలే లోకేష్ పట్ల విరక్తికి కారణం అని చెప్పొచ్చు. ఒక్క రజనీ కాంత్‌ని తప్పితే... ఇతర భారీ తారాగణాన్ని ఎంచుకోవడంపైన అతిగా ఫోకస్ పెట్టినప్పటికీ వారికి తగ్గ కేరెక్టర్స్ ఇవ్వడంలోనూ, కధనంపైనా తగినంత శ్రద్ధ పెట్టలేదు. లోకేష్ స్టార్స్‌ని హ్యాండిల్ చేయడంలో విఫలం అయ్యాడని దాదాపుగా ప్రతీ స్టార్ ఫ్యాన్స్ ఫీలయ్యారు. నాగార్జున, ఉపేంద్ర... లాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా వారికి తగినంత ప్రాథాన్యత ఇవ్వడంలో లోకేష్ ఫెయిలయ్యాడు. అన్నింటికన్నా పరాకాష్ట అమీర్ ఖాన్ పాత్ర అని చెప్పాలి.
కూలిలో అమీర్ ఖాన్ కి దాహా క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ దాన్ని పరమ దారుణంగా హ్యాండిల్ చేయడంతో ఆ పాత్ర కాస్తా కామెడీకి ఎక్కువ విలనీకి తక్కువగా మారిపోయింది. సినిమా విడుదల తర్వాత తన పాత్రపై అమీర్ ఖాన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది లోకేష్ స్థాయిని పూర్తిగా మసకబార్చింది. ఏది ఏమైనా మంచి టాలెంట్ వున్న లోకేష్ అనవసర అర్భాటాలకు పోయి తెచ్చుకున్న ఈ దశ మారాలంటే వీటిని చేరిపేసే, మరుగున పడేసేలా ఓ క్లీన్ హిట్ పడాల్సిందే..


