
ఆ రంగు, లుక్స్ చూసి ఫ్యూచర్ హీరో అనుకున్నారు. కొన్ని సినిమాలతోనే చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతలోనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి విలనిజం కూడా చేయగలనని హింటిచ్చాడు. సినిమాలకే ఎందుకు పరిమితం కావాలనుకున్నాడో ఏమో కానీ బుల్లితెరపైనా తళుక్కుమని మెరిశాడు. రెండుచోట్లా గుర్తింపు సంపాదించుకున్న ఆయన 25 ఏళ్లుగా కనిపించకుండా పోయాడు. అతడే బాలీవుడ్ నటుడు రాజ్ కిరణ్..
అగ్రతారగా ఎదుగుతాడనుకునేలోపే..
రాజ్ కిరణ్ (Actor Raj Kiran).. 1975లో 'కాగజ్ కీ నవో' చిత్రంతో కెరీర్ ప్రారంభించాడు. రిషి కపూర్, గోవింద, అనిల్ కపూర్, శ్రీదేవి, రేఖ, హేమమాలిని వంటి పలువురు అగ్రతారలతో కలిసి పనిచేశాడు. బషీర, కర్జ్, అర్థ్, తేరి మెహర్బనియన్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్.. వంటి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు! వాకిట్లో ఎప్పుడూ విజయాలే సిద్ధంగా ఉంటాయా? మొదట్లో ఎంతో సక్సెస్ చూసిన రాజ్‌కిరణ్ తర్వాత ఫ్లాపుల్ని కూడా చూశాడు. కొన్ని సినిమాలైతే అర్ధాంతరంగా ఆగిపోయేవి. అంతా ఓకే అయ్యాక, షూటింగ్ కూడా మొదలుపెట్టాక అటకెక్కేవి. ఇలా తన కెరీర్ కిందకుపడిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్‌కు వెళ్లిపోయాడు.
25 ఏళ్లుగా మిస్సింగ్
దీంతో 2000వ సంవత్సరంలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చేరినట్లు తెలుస్తోంది. దర్శకుడు మహేశ్ భట్ కూడా అతడిని చూసేందుకు పలుమార్లు వెళ్లొచ్చాడంటుంటారు. కానీ తర్వాత రాజ్‌కిరణ్ కనిపించకుండా పోయాడు. అతడి గురించి ఇంటిసభ్యులు వెతకని చోటంటూ లేదు. రిషికపూర్, దీప్తి నావల్.. సిటీ అంతా జల్లెడ పట్టారు. రోజులు నెలలయ్యాయి. నెలలు సంవత్సరాలయయ్యాయి. అయినా అతడి జాడలేదు. 25 ఏళ్లుగా అతడు కనిపించకపోవడం అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

పిచ్చి ఆస్పత్రి నుంచి..
నటుడి మిస్సింగ్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ముంబైలోని బైకుల్లా పిచ్చి ఆస్పత్రిలో రాజ్‌కిరణ్ ఉండేవాడని, అక్కడినుంచి సడన్‌గా మాయమైపోడని అంటుంటారు. కొందరేమో అట్లాంటాలోని పిచ్చాసుపత్రిలో ఉన్నాడంటారు. మరికొందరేమో న్యూయార్క్‌లో టాక్సీ డ్రైవ్ చేస్తూ కనిపించాడని చెప్తుంటారు. 2000వ సంవత్సరంలో రాజ్ కిరణ్ అదృశ్యమయ్యేనాటికి అతడి భార్య రూప, కూతురు రిషిక ఉన్నారు.
ఎప్పటికైనా తిరిగొస్తాడని..
తండ్రి ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉండుంటాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది కూతురు రిషిక మహతని. తన తండ్రి అట్లాంటాలో పిచ్చాసుపత్రిలో ఉన్నాడన్న ప్రచారాన్ని సైతం ఖండించింది. పోలీసులు, డిటెక్టివ్‌ల సాయంతో తండ్రిని వెతికిస్తున్నామంది. అయినా ఇంతవరకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. ఏళ్లు గడుస్తున్నా భర్త తిరిగిరాకపోవడంతో రూప రెండో పెళ్లి చేసుకుందని సమచారం.
మాట నిలబెట్టుకోలేకపోయిన నటి
రాజ్‌కిరణ్ కోసం సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, నటి సోమి అలీ కూడా తెగ వెతికింది. నీ క్లోజ్ ఫ్రెండ్ ఎక్కడుతన్నా వెతికి తీసుకొస్తాను అని రిషి కపూర్‌కు మాటిచ్చింది. 20 ఏళ్లపాటు వెతికినా ఫలితం లేకపోయింది. అసలు రాజ్ కిరణ్ ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకు కనిపించకుండా పోయాడు? ప్రస్తుతం బతికే ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.
చదవండి: శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్ వండుకుని తిన్నా: హీరోయిన్