హాలీవుడ్ మ్యూజికల్ స్టార్స్‌పై బయోపిక్స్
ఆనందానికిపాట... ఆరోగ్యానికిపాట...
కల్యాణానికిపాట... కలలకుపాట...
విషాదానికిపాట... వినోదానికిపాట...
స్ఫూర్తికిపాట... సందేశానికిపాట...
ఇలా మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీపాట ఉంటుంది. అందుకేపాట సృష్టించేవాళ్లన్నా, సాహిత్యం అందించేవాళ్లన్నా, ఆపాటకు తమ గాత్రంతో ప్రాణం పోసేవాళ్లన్నా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలా వెండితెర కోసం పసందైనపాటలతో ప్రేక్షకులను అలరించిన మ్యూజికల్ స్టార్స్ ఎందరో ఉన్నారు. హాలీవుడ్‌లో ఇలాంటి స్టార్స్ జీవితాలపై ‘బయోపిక్స్’ రూపొందుతున్నాయి. బయోపిక్స్ రూపొందడం కామన్. అయితే ఒకేసారి అరడజనుకి పైగా మ్యూజికల్ బేస్డ్ బయోపిక్స్‌కి శ్రీకారం జరగడం విశేషం. ఆ మ్యూజికల్ స్టార్స్ వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని ఈ చిత్రాలు ఆవిష్కరించనున్నాయి. ఇక థియేటర్స్‌లో కూర్చున్న ప్రేక్షకులనుపాటల ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆ ‘మ్యూజికల్ బయోపిక్స్’ విశేషాలు తెలుసుకుందాం.
ఏప్రిల్ 24న మైఖేల్
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ ప్రపంచం కోసం వదిలి వెళ్లినపాటల రూపంలో జీవించే ఉన్నారు. ఆయన జీవితంలోని కీలక విషయాలను వెండితెరపై చూసే సమయం ఆసన్నమైంది. ‘మైఖేల్’ టైటిల్‌తో రూపొందిన ఈ బయోగ్రఫీలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జెర్మైన్ జాక్సన్ తనయుడు జాఫర్ జాక్సన్ టైటిల్ రోల్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూసినవాళ్లు జాఫర్ అచ్చం తన బాబాయిలానే ఉన్నాడని పేర్కొనడంతో లుక్ పరంగా మార్కులు కొట్టేశారు జాఫర్. ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గ్లాడియేటర్, ది ఏవియేటర్’ వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన జాన్ లోగన్ ‘మైఖేల్’ స్క్రిప్ట్ రాశారు.
గ్రాహం కింగ్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘‘మైఖేల్ జీవితాన్ని నిజాయతీగా చూపించాలన్నది మా లక్ష్యం. అలానే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం’’ అని గ్రాహం పేర్కొన్నారు. ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘మైఖేల్’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ‘ది జాక్సన్: యాన్ అమెరికన్ డ్రీమ్’ పేరిట ఐదు గంటల మినీ సిరీస్ రెండు భాగాలుగా ఏబీసీ టెలివిజన్‌లో ప్రసారమైంది.
మైఖేల్ జాక్సన్ బతికి ఉన్నప్పుడే 1992లో ఈ సిరీస్ రూపొందింది. జాక్సన్, అతని కుటుంబం, అతని సోదరులు మ్యూజికల్ ఫీల్డ్‌లో ఎలా ఎదిగారు వంటి విశేషాలతో ప్రధానంగా ఈ సిరీస్ రూపొందింది. సో... హాలీవుడ్ చెబుతున్న ప్రకారం మైఖేల్ జాక్సన్ జీవితంపై రానున్న సమగ్ర చిత్రం ‘మైఖేల్’ అని తెలుస్తోంది. ఇక 50 ఏళ్ల వయసులో 2009 జూన్ 25న మైఖేల్ మరణించిన విషయం తెలిసిందే. ఈ పాప్ కింగ్‌పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
హూ ఈజ్ దట్ గర్ల్
‘‘నా కంటే నా కథను ఎవరు బాగా రాయగలరు... చూపించగలరు’’ అంటున్నారు మడోన్నా. ‘క్వీన్ ఆఫ్‌పాప్’గా పేరు తెచ్చుకున్న మడోన్నా తన జీవితంతో ‘హూ ఈజ్ దట్ గర్ల్’ టైటిల్‌తో సినిమా నిర్మించాలని ఐదేళ్ల క్రితమే అనుకున్నారు. 2020లోనే ఈ చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారామె. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు కూడా. అయితే 2020 నుంచి 2023 వరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. 2024లో తాను ఈ సినిమాకి స్క్రిప్ట్ తయారు చేస్తున్నట్లు పేర్కొని, కొన్ని ఫొటోలను, వీడియోలను కూడా షేర్ చేశారు మడోన్నా.
సంగీతమే తనను నడిపించింది కాబట్టి ఈ సినిమా ఫోకస్ మొత్తం మ్యూజిక్ పైనే ఉంటుందని కూడా పేర్కొన్నా రామె. అయితే గడచిన ఐదేళ్లల్లో ఆమె ప్లాన్ చేసుకున్న మ్యూజికల్ ట్యూర్స్, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ ఏడాది ఈ సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలని మడోన్నా అనుకుంటున్నారట. మడోన్నాపాత్రను జూలియా గార్నర్ చేయనున్నారు. ‘‘నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని, సింగర్‌ని కాదు. అందుకని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాను. నా నటనతో మడోన్నాని మెప్పించాలనుకుంటున్నాను’’ అని గార్నర్ పేర్కొన్నారు.
వన్ డైరెక్టర్... ఫోర్ బయోపిక్స్
ఒక డైరెక్టర్ ఒక బయోపిక్ చేయడం అంటే అది పెద్ద విషయమేం కాదు. కానీ ఒక దర్శకుడు నాలుగు బయోపిక్స్ చేయడం మాత్రం విశేషం అనే చె΄్పాలి. ఆ దర్శకుడు ఎవరంటే ‘సామ్ మెండిస్’. ‘ద బీటిల్స్’ అనే రాక్ బ్యాండ్ పై నాలుగు చిత్రాలు రూపొందించడానికి సామ్ సన్నాహాలు చేస్తున్నారు. 1960లో ఈ రాక్ బ్యాండ్ ఫామ్ అయింది. అప్పట్లో ఈ బ్యాండ్ చాలాపాపులర్. ‘ద బీటిల్స్’పై సినిమా అనేది తన కలల ప్రాజెక్ట్‌గా చెబుతున్నారు దర్శకుడు సామ్ మెండిస్. ఈ రాక్ బ్యాండ్‌లోని సభ్యుల (పాల్ మెక్‌కార్ట్‌నీ, జాన్ లెన్నాన్, జార్జ్ హారిసన్, రింగో స్టార్) జీవితాలపై ఈ నాలుగు చిత్రాలు ఉంటాయి.
ఒక్కో స్టార్ జీవితంతో ఒక్కో సినిమా ఉంటుంది. ఈ చిత్రాల్లోపాల్ మెక్‌కార్ట్‌నీగాపాల్ మెస్కల్, జాన్ లెన్నాన్ క్యారెక్టర్‌ను హ్యారిస్ డికిన్‌సన్, రింగో స్టార్‌పాత్రను బ్యారీ కియోగన్, జార్జ్ హారిసన్ క్యారెక్టర్‌ను జోసెఫ్ క్విన్ చేయనున్నారు. ‘ద బీటిల్స్ – ఎ ఫోర్ – ఫిల్మ్ సినిమాటిక్ ఈవెంట్’ టైటిల్‌తో ఈ నాలుగు చిత్రాలు రూపొందనున్నాయి. ఇక సాదా సీదా స్థాయి నుంచి స్టార్‌డమ్ వరకూ సంగీత ప్రపంచంలో ఎదగడానికి ‘ద బీటిల్స్’ రాక్ బ్యాండ్ చేసిన కృషి నేపథ్యంలో ఈ చిత్రాలు ఉంటాయి. ఈ నాలుగు చిత్రాలనూ 2028లోనే విడుదల చేయాలనుకుంటున్నారు.
గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్
అమెరికన్ సంగీత చరిత్రలో సింగర్‌గా, రైటర్‌గా, గిటారిస్ట్‌గా అత్యంత ప్రభావం చూపినవారిలో సిస్టర్ రోసెట్టా థార్పే ఒకరు. 1915లో పుట్టారు రోసెట్టా. అయితే 1921లోనే తన తల్లితో కలిసి మ్యూజికల్ ట్రూప్‌లో సింగింగ్ టాలెంట్‌ని చూపించడంతోపాటు గిటారిస్ట్‌గానూ భేష్ అనిపించుకుంది చిన్నారి రోసెట్టా. పెద్దయ్యాక సంగీత ప్రపంచంలో దూసుకెళ్లారామె. ముఖ్యంగా 1930–1940 మధ్యకాలంలో అప్పటి తరం శ్రోతలను తనపాటలతో అలరించారు. అంతటి ప్రతిభాశాలి అయిన సిస్టర్ రోసెట్టా థార్పే జీవితం ఆధారంగా ‘ఎ రోసెట్టా’ చిత్రం రూపొందనుంది. ‘గాడ్ మదర్ ఆఫ్ రాక్ అండ్ రోల్’గా పేరు పొందిన రోసెట్టా క్యారెక్టర్‌ను ఆమె బయోపిక్‌లో సింగర్, ర్యాపర్, నటి‡లిజ్జో పోషించనున్నారు. అలాగే ఈ చిత్రానికి ఓ నిర్మాతగానూ వ్యవహరించనున్నారామె. అయితే ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
బీ మై బేబీ
అమెరికన్ మ్యూజికల్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ షో మేన్’లో నటించడంతోపాటు తన గాత్రాన్ని వినిపించి, మరింతగా ఆకట్టుకున్నారు జెండయా. మంచి నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఓ మ్యూజికల్ ఫిల్మ్‌లో నటించనున్నారు. ‘బీ మై బేబీ’ టైటిల్‌తో దివంగత ప్రముఖ గాయని రోనీ స్పెక్టర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో రోనీ స్పెక్టర్‌పాత్రను జెండయా చేయనున్నారు. బ్యారీ జెంకిన్స్ దర్శకత్వం వహించనున్నారు. కాగా... రోనీ స్పెక్టర్ అంటే తనకెంతో అభిమానం అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు జెండయా. 2022లో రోనీ మరణించినప్పుడు నివాళి అర్పిస్తూ, ఎంతో భావోద్వేగానికి గురయ్యారు జెండయా. కెమెరా ముందు రోనీగా ఒదిగిపోవడానికి ఎంత కృషి చేయాలో అంతా చేస్తానంటున్నారామె.
బాయ్ జార్జ్ జీవితంతో...
1980లలో తమ గాత్రంతో శ్రోతలను ముగ్ధులను చేసిన గాయకుల్లో బాయ్ జార్జ్ ఒకరు. వేరే రచయితలతో కలిసి బాయ్ జార్జ్ రాసిన ‘టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్’, ‘స్ట్రైట్’, బాయ్ జార్జ్ మాత్రమే రాసిన ‘ఎ కర్మ’ ఆటోబయోగ్రఫీల ఆధారంగా బాయ్ జార్జ్ బయోపిక్ రూపొందనుంది. బాయ్ జార్జ్‌పాత్రను సోఫీ టర్నర్ చేసే అవకాశం ఉందట. దర్శకుడు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే... బాయ్ జార్జ్ అబ్బాయి కాబట్టి... ఆపాత్రను అబ్బాయే చేయాలని, నటి సోఫీ టర్నర్‌తో ఎందుకు చేయించాలనుకుంటున్నారనే చర్చ హాలీవుడ్‌లో జరుగుతోంది. అయితే తనపాత్రకు సోఫీ టర్నర్ పూర్తి న్యాయం చేస్తుందని నమ్ముతున్నానని బాయ్ జార్జ్ అంటున్నారు. ‘‘నాపాత్రను సోఫీ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ... ‘ఆమె మీపాత్ర చేయలేదు... ఆమె ఒక మహిళ...’ అని అందరూ అంటున్నారు. అయితే నాకు 17 ఏళ్లు ఉన్నప్పుడు నేను ఆమెపాత్ర చేయాలనుకున్నాను. నాకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు నా బయోపిక్‌లో ఆమె నాపాత్ర చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది’’ అని బాయ్ జార్జ్ అంటున్నారు.
ఈ చిత్రాలు మాత్రమే కాదు... దివంగత డ్రమ్మర్ కీత్ మూన్ బయోపిక్, అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, పియానిస్ట్ బిల్లీ జోయెల్ జీవితం ఆధారంగా... ఇలా పలు బయోపిక్స్ రానున్నాయి. – డి.జి. భవాని


