
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిసిందే. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షోకి మంచి ఆదరణ ఉంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షో కోసం ఎదురు చూసే బుల్లితెర ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. త్వరలోనే సీజన్ 9(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. ఈ సారి ఈ గేమ్ షోని సరికొత్త ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్కి కంటెస్టెంట్లను డైరెక్ట్గా హౌస్లోకి పంపేవారు. ఈ సారి మాత్రం షో ప్రారంభానికి ముందే కొంతమందికి ‘అగ్ని పరీక్ష’ పెట్టారు. ఇందులో పాల్గొని గెలిచిన ఐదు లేదా ఆరుగురిని హౌస్లోకి పంపుతారు. వీరితో పాటు మరికొంతమంది డైరెక్ట్‌గా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లబోతున్నారు.
సరికొత్తగా
బిగ్‌బాస్ సీజన్ 9ని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటి వరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా ఒకే హౌస్లో ఉండేవాళ్లు. కానీ సీజన్ 9లో మాత్రం కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి..వేరు వేరు హౌస్లో ఉండబోతున్నారు. ఈ సీజన్‌లో 15 మంది కంటే ఎక్కువే హౌస్లోకి వెళ్లబోతున్నారు. వారిలో సగం ఒక హౌస్లో ఉంటే..మరో సగం మంది వేరే హౌస్లో ఉంటారు. ఆట తీరుని బట్టి కంటెస్టెంట్ ఏ ఇంట్లో ఉండాలో డిసైడ్ చేస్తారట. వీరికి పెట్టే టాస్క్లు కూడా కొత్తగా ఉండబోతున్నాయట. ఈ సారి మైండ్ గేమ్‌తో పాటు ఫిజికల్ టాస్క్‌లు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్స్ వీరే?
ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల లిస్ట్ బయటకు వచ్చింది. సీజన్ 9లో పాల్గొనేది వీళ్లే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. వారిలో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోక్ష, యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, కమెడియన్ సుమన్ శెట్టి, కన్నడ నటి తనూజ పుట్టస్వామి, సీరియల్ నటుడు భరణి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కామనర్స్గా శ్రీజ, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీశ్ వెళ్లే అవకాశం ఉంది. మరి వీరిలో నిజంగానే ఎంతమంది బిగ్‌బాస్ షోలోకి వెళ్తున్నారనే విషయం తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకు ఆగాల్సిందే.