ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ నేడు ఎంతోమందికి ఛాన్సులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే మాస్ మహారాజ తన 75వ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. సామజవరగమన మూవీకి రచయితగా పని చేసిన భాను భోగవరపును డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాడు. తన జీవితం ముగిసిపోయిందనుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను ధమాకాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మలిచాడు. అందుకే రవితేజ అంటే భీమ్స్‌కు ప్రాణం. అదే విషయాన్ని ఆయన మరోసారి వెల్లడించాడు.
నా వెనక ఓ ధైర్యం
రవితేజ ప్రధాన పాత్రలో నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్స్ స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ధమాకా తర్వాత నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ చేసేవరకు నా వెనక ఓ ధైర్యం ఉంది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలి. ఎట్ల నేను సేద్దునో.. ఎట్ల పడి నేను సద్దునో.. అంటూ సెల్‌ఫోన్‌లో ఓ వీడియో తీసుకున్నాను.

కుటుంబంతో కలిసి పైకి..
అప్పుడు నా భార్యాపిల్లల్ని కూడా వీడియో తీశాను. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడుస్తుంది? అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న రోజుల్లో నాకో ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీస్‌కు రమ్మని ఆహ్వానం వచ్చింది. నమ్మలేకపోయాను. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలతో కలిసి కట్టకట్టుకుని పైకి వెళ్లిపోదామనుకున్నాను.
దేవుడిలా కాపాడాడు
అలాంటి సమయంలో దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి పేరు, వ్యక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సర్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే కారణం ఆయనే! అమ్మానాన్న, నీ కొడుకు సజీవంగా ఉండటానికి రవితేజ సర్ కారణం. అవకాశాల కోసం చాలామంది కథలు, కహానీలు చెప్తారనుకుంటారు. సిసిరోలియో ఎప్పుడూ కహానీలు చెప్పడు. ఉన్నదే చెప్తాడు. అందుకే సర్‌కు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం (దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారి వాయిస్‌ని ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను (తూ మేరా లవర్ పాటని ఉద్దేశించి) అని భీమ్స్ సిసిరోలియో భావోద్వేగానికి లోనయ్యాడు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com


