
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రేణుకాస్వామి అనే అభిమాని హత్యకేసులో నిందితుడైన ఆయనను బెయిల్ రద్దు కావడంతో అరెస్టై జైలుకు వెళ్లారు. ఈ కేసులో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో విచారణకు వర్చువల్గా హాజరైన దర్శన్.. న్యాయమూర్తికి తన బాధలను చెప్పుకొచ్చారు. జైల్లో ఉండలేకపోతున్నానని.. తన పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని అన్నారు. దయచేసి తనకు ఇంత విషమివ్వాలని జడ్జిని అభ్యర్థించాడు. నా జీవితం దారుణంగా తయారైందని జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే దర్శన్ పరిస్థితిని అర్థం చేసుకున్న బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు బదిలీ చేయాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చడానికి ఎటువంటి బలమైన కారణం లేదని పేర్కొంది. కాగా.. రేణుకాస్వామి హత్య కేసులో 7 మంది నిందితులు వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. దర్శన్ తరపు న్యాయవాదులు కనీసం ఒక మంచం, దిండును అందించాలని జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు దర్శన్ జడ్జితో మాట్లాడుతూ.. 'నెల రోజులకు పైనే అవుతుంది ఎండ అన్నది చూడలేదు. దీంతో నా చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేశాయి. బట్టలు కంపు కొడుతున్నాయి. ఇలా నేను బతకలేను. ఒక్క చుక్క విషం ఇవ్వండి నేను చనిపోతా. నా జీవితం దారుణంగా తయారైంది' అని దర్శన్ ముందు విలపించాడు. దీనిపై స్పందించిన జడ్జి.. అలాంటివి మీరు అడగకూడదు. ఇది జరగదు' అని సమాధానమిచ్చారు.