బ్లాక్‌బోర్డు అంటూ నా కలర్‌పై కామెంట్స్ చేస్తున్నారు: నటి

ఇటీవల కాలంలో నటీనటులు తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్నారు. వారి వ్యక్తిగత జీవితం, శరీరాకృతి, బరువు, స్కిన్ కలర్‌పై కూడా నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తు వారిని టార్గెట్ చేస్తుంటారు. అయితే కొంతమంది వీటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే, మరికొందరూ వారి కామెంట్స్ తట్టుకోలేక పోలీసులు, కేసుల వరకు వెళుతున్నారు.
తాజాగా ప్రముఖ బెంగాలీ నటి శ్రుతి దాస్ కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. గత రెండేళ్లుగా తన స్కీన్ కలర్‌పై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారంటూ గురువారం ఆమె కలకత్తా సైబర్ పోలీసులను ఆశ్రయించింది. జీమెయిల్ ద్వారా శ్రుతీ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఫేస్‌బుక్‌లో తనపై వచ్చి కామెంట్స్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసీ సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఈ సందర్భంగా శ్రుతీ దాస్ ‘రెండేళ్లుగా నేను ఓ డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉన్నందునే నాకు ఆఫర్స్ వస్తున్నాయని, లేదంటే నీలాంటి మేనీ ఛాయ ఉన్నవాళ్లకు ఆఫర్స్ రావడం కష్టమేనంటూ తన కలర్‌పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బ్లాక్‌బోర్డు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లు వాటిని చూసి చూడనట్టు వదిలేశాను. ఇప్పుడు అవి మరింత అధికమయ్యాయి.
రోజు రోజుకు ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. తట్టుకోలేకపోతున్న’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక దీనిపై సైబర్ సెల్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నటి శ్రుతీ నుంచి మాకు గురువారం ఈమెయిల్ వచ్చిందని, తను 2019 నుంచి తన రంగుపై విమర్శలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొందన్నారు. అలాగే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా జత చేసిందని, ప్రస్తుతం ఈ కేసును పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా శ్రుతీ దాస్ 2019లో సుబ్బు త్రినయని అనే టీవీ సీరియల్‌తో నటిగా తెరంగేట్రం చేసింది. ఈ షో సమయం నుంచే తను ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె దేశర్ మాతీ సీరియల్‌లో నటిస్తుంది.