
దుబాయ్‌లో జరుగుతున్న సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుకలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటారు. పుష్ప2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆయన అవార్డ్ సొంతం చేసుకున్నారు. సైమా నుంచి ఇప్పటి వరకు ఐదు అవార్డ్స్ బన్నీకి లభించాయి. గతంలో సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలా వైకుంఠపురంలో (2021),పుష్ప (2022) చిత్రాలకు సంబంధించి అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌లో జరిగిన 'గామా' అవార్డ్స్ -2025లో కూడా బన్నీ సత్తా చాటారు. 'గామా' నుంచి బెస్ట్ యాక్టర్ (పుష్ప 2) అవార్డును తొలిసారి అందుకున్నారు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గద్దర్ అవార్డ్స్-2025లో కూడా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా గద్దర్ తొలి అవార్డ్ అందుకుని తెలంగాణ చరిత్ర పుటల్లో చేరారు. అల్లు అర్జున్ తన కెరీర్‌లో 20కి పైగా ఎంతో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. ఇది ఆయన నటనా ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు.

పుష్ప2 ఖాతాలో సైమా అవార్డ్స్
సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, ఉత్తమ సింగర్‌గా శంకర్ బాబు కందుకూరి (పీలింగ్స్) పాటకు అందుకున్నారు. ఏకంగా ఈ చిత్రానికి 5 అవార్డ్స్ రావడం విశేషం.
అల్లు అర్జున్‌కు అవార్డ్స్.. సీక్రెట్ ఏంటి..?
గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా ఒక సంచలనం.. సినిమా కలెక్షన్స్‌తో పాటు అనేక రికార్డ్స్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అల్లు అర్జున్‌కు అవార్డులు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఆయన నటనలో అభినయం, శ్రమ, వైవిధ్యం కనిపిస్తాయి. ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు తన శక్తిని అంతా ఉపయోగిస్తారు. ఆయన నటనా ప్రస్థానమే కాకుండా.. పాత్రల ఎంపిక ఆపై సినిమా ఏదైనా సరే అందులో ఆయన చూపించే మెథడ్ యాక్టింగ్ తనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాత్ర కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్ ప్రాక్టీస్, యాసలు నేర్చుకోవడం వంటి అంశాలపై ఆయన చేసిన కృషి.. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ ఒదిగిపోయే విధానం ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. అల్లు అర్జున్‌కి అవార్డులు రావడం కేవలం గెలుపు మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా పెంచిన ఘనత కూడా అని చెప్పవచ్చు.

నటన, డ్యాన్స్‌తో ఆధిపత్యం
ఆర్యలో అమాయక ప్రేమికుడిగా కనిపించిన బన్నీ.. వేదంలో స్ట్రీట్ కుర్రాడిగా మెప్పించారు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి పాత్రలో తెలుగు చరిత్రకు ప్రాణం పోసినట్టు చేశారు. పుష్పలో చిత్తూరు యాస, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ గడ్డపై ఆధిపత్యం చూపించారు. పుష్పలో “తగ్గేదే లే” అనే డైలాగ్‌కి ఆయన ఇచ్చిన ఎమోషనల్ వెయిట్ మామూలుగా ఉండదు. ఇలా ప్రతి సినిమాలో కూడా తన ప్రత్యేకతను చూపారు. అల్లు అర్జున్‌కి 'ఇండియా బెస్ట్ డాన్సర్' అనే ట్యాగ్ రావడానికి కారణం వెండితెరపై ఆయన వేసిన స్టెప్పులని చెప్పవచ్చు.
బుట్ట బొమ్మ, సీటీ మార్, టాప్ లేచిపోద్ది వంటి పాటల్లో స్పీడ్, గ్రేస్, కంట్రోల్ అన్నీ కలిపి మనకు ఒకేసారి చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులకే కాదు, మలయాళం, తమిళం, హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. బన్ని నటనా శైలి అంటే ఒకే ఫార్ములా కాదు.. ప్రతి పాత్రకు తనదైన శైలి, శక్తికి మించిన శ్రమతో ప్రాణం పోసేలా కష్టపడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనకు అవార్డులతో పాటు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.