‘బ్యాండు మేళం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌! | Band Melam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘బ్యాండు మేళం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌!

Mar 26 2026 12:18 PM | Updated on Mar 26 2026 12:42 PM

Band Melam Movie Review And Rating In Telugu

‘కోర్ట్‌’ఫేమ్‌ హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన తాజా చిత్రం ‘బ్యాండు మేళం’. సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 13నే విడుదల కావాల్సింది. కానీ చివరి నిమిషం వాయిదా వేసి.. నేడు(మార్చి 26)న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చిరంజీవితో పాటు టాలీవుడ్‌ స్టార్స్‌ అంతా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ‘బ్యాండు మేళం’పై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుంది? కోర్ట్‌ మాదిరే హర్ష్‌ రోషన్‌, శ్రీదేవిలకు మరో హిట్‌ దక్కిందా? లేదా? రివ్యూ(Band Melam Review)లో చూద్దాం.

కథేంటంటే.. 
తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యాదగిరి అలియాస్‌ గిరి(హర్ష్‌ రోషన్‌), రాజీ(శ్రీదేవి) బావమరదళ్లు. చిన్నప్పుడు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంట్లో వాళ్లు కూడా పెద్దయ్యాక ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్‌ అవుతారు. కానీ వీరిద్దరు పెద్దయ్యే సరికి పరిస్థితులు తారుమారు అవుతాయి. గిరి వాళ్ల నాన్న సుందరయ్య(గోపరాజు విజయ్‌) దానధర్మాలు చేసి అప్పుల పాలవుతాడు. గిరి ఏమో పదోతరగతి ఫెయిల్‌ అయి స్నేహితులతో బ్యాండు మేళం నడుపుతుంటాడు. మరోవైపు రాజీ వాళ్ల నాన్న సాయన్న(సాయి కుమార్‌) బావ సుందరయ్య చేసే సాయంతో కోటీశ్వరుడు అవుతాడు. రాజీ టెన్త్‌ టాపర్‌గా నిలిచి..ఇంటర్‌ పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో జాయిన్‌ అవుతుంది. 

ప్రేమ, పెళ్లి అంటూ బావ గిరి వెంటపడుతున్నా పట్టించుకోదు. సాయన్న కూడా తన కూతురుని గిరికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడు. ఓ గొప్పింటి అబ్బాయితో పెళ్లి ఫిక్స్‌ చేస్తాడు. పెళ్లి రోజు రాత్రే రాజీ.. తన క్లాస్‌మేట్‌ రాజేశ్‌తో కలిసి లేచిపోతుంది. ప్రాణంగా ప్రేమించిన మరదలు.. వేరే వ్యక్తితో లేచిపోయిన విషయం తెలిసిన తర్వాత గిరి ఏం చేశాడు? లేచిపోయిన రాజీ తిరిగి గిరి ఇంటికి ఎందుకు వచ్చింది?  గిరి మ్యూజిక్‌ లో సక్సెస్‌ అయ్యాడా? ఈ బావమరదళ్లు మళ్లీ ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  



ఎలా ఉందంటే.. 
టాలీవుడ్‌ రచయితల్లో కోన వెంకటేశ్‌కు ఉన్న క్రేజీ గురించి తెలిసిందే. కామెడీ ఫ్యామిలీ డ్రామా కథలను రాయడంతో ఆయన సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య  ఆయన కథలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడుతున్నాయి. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని తనకు బలమైన కామెడీ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే ‘బ్యాండు మేళం’  కథను రాసుకొని.. సొంతంగా నిర్మించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.  ప్రచార చిత్రాలు, ప్రమోషనల్‌ ఈవెంట్లలో ఆయన మాటలు విని .. ఈ సారి కొత్త కామెడీతో నవ్విస్తాడని అంతా భావించారు. కానీ కోన మాత్రం మళ్లీ పాత కథతోనే నవ్వించే ప్రయత్నం చేశాడు.  కథ మాత్రమే కాదు కథనం కూడా పాతగానే ఉంటుంది. కొత్తదనం అనేది మచ్చుకైనా కనిపించదు.  రొటీన్‌ కామెడీ స్టోరీకి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ యాడ్‌ చేశారంతే. 

హీరో జులాయి.. హీరోయిన్‌ రిచ్‌ కిడ్‌.. వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డురావడం.. చివరకు ఒక్కటవ్వడం.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి ఈ కథలను చూస్తూ వస్తున్నాం.  అలాంటి కథతో సతీష్‌ జవ్వాజీ తెరకెక్కిన చిత్రమే ఈ బ్యాండు మేళం. బావమరదళ్ల లవ్‌స్టోరీలో అయినా కొత్తదనం ఉంటుందా అంటే అదీ ఉండడు. ఇక కథకు కీలకమైన ట్విస్టులు కూడా ఊహకందేలా ఉండడంతో కథనం ఎక్కడ రక్తి కట్టించదు. 

కోన గారి రెగ్యులర్‌ కథల్లానే ఈ సినిమా కథ కూడా చైల్డ్‌వుడ్‌ ఎపిసోడ్‌తో మొదలవుతుంది. హీరోహీరోయిన్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని చూపించి.. అసలు కథను ప్రారంభించారు.  ఫస్టాఫ్‌లో బ్యాండు మేళం బ్యాచ్‌తో హీరో చేసే అల్లరి కొంతమేర నవ్విస్తుంది. స్టూడియో కట్టేందుకు హీరో గ్యాంగ్‌ చేసే పని సిల్లీగా అనిపించినా.. ఎంటర్‌టైన్‌ అవుతారు.  ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ కాస్త ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఎంతకూ ముందుకు కదలదు. ఒకే పాయింట్‌ చుట్టూ కథను తిప్పారు.  క్లైమాక్స్‌లో  రాజీ పాత్ర ఇచ్చే ట్విస్టు కూడా ఊహించేలా ఉంటుంది. 



ఎవరెలా చేశారంటే.. 
గిరి పాత్రలో హర్ష్‌ ఒదిగిపోయాడు. తెరపై చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. రాజీగా శ్రీదేవి కూడా బాగా నటించింది. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్‌ అయింది. ఇక హీరోయిన్‌ తండ్రి సాయన్నగా సాయికుమార్‌ రెగ్యులర్‌ పాత్రలో కనిపించి, మెప్పించాడు. హీరోగ్యాంగ్‌గా కనిపించినవారంతా కొత్తవాళ్లే అయినా.. చక్కగా నటించారు. ముఖ్యంగా ఆ గ్యాంగ్‌లోని అమ్మాయి పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజ‌య్ బుల్గానిక్ నేపథ్య సంగీతం బాగుంది. ‘తిప్పుకుంటున్నవావే..’ అంటూ సాగే ఫోక్‌ సాంగ్‌ తెరపై మరింత ఆకట్టుకునేలా ఉంది.  మిగతా పాటలు ఒకే. సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో కోన వెంకట్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement