
మలయాళ నటి నవ్య నాయర్ (Navya Nair) ఆస్ట్రేలియాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఆమె మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే, తన బ్యాగులో మల్లెపూలను తీసుకెళ్లడంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలను తీసుకువెళ్లడం అక్కడ నిషిద్ధం. ఈ క్రమంలోనే నవ్య నాయర్ బ్యాగులో పూలు లభించడంతో ఆమెకు రూ. 1.14లక్షల జరిమానా విధించారు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అయ్యారు.
తాను ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని, జరిమానాను రద్దు చేయాలని కోరుతూ ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖకు నవ్య నాయర్ లేఖ రాశారు. ఆపై ఆస్ట్రేలియన్ కస్టమ్స్ అధికారులకు కూడా ఆమె లేఖను పంపారు. "జరిమానా విధించిన తర్వాత నేను ఒక విధంగా షాక్ అయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవంగా ఆరోజు నా బ్యాగ్‌లో పువ్వులు తీసుకెళ్లనే లేదు. పువ్వులు నా జుట్టుమీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ బహిరంగంగానే కనిపిస్తుంది. దానిని నేను ఏమీ దాచలేదు. కానీ, నా బ్యాగులో మొదట పువ్వులు ఉంచడం వల్ల ఎయిర్పోర్ట్లోని స్నిఫర్ డాగ్స్ పసిగట్టాయి. బ్యాగులో ఒకటి లేదా రెండు ఫ్లవర్ బాగాలు ఉండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ఫైన్ వేశారు. 28రోజుల్లో చెల్లించాలని కోరారు' అని ఆమె చెప్పారు.
ఆస్ట్రేలియన్ వ్యవసాయ శాఖను మెయిల్ ద్వారా నవ్య నాయర్ సంప్రదించారు. 'జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయమని కోరాను. వారు మాఫీ చేయకపోతే రూ. 26వేలు వసూలు చేస్తారని ఒక ఆర్టికల్లో చదివాను. ప్రస్తుతానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే నాకు వేరే మార్గం లేదు. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి. ' అని ఆమె అన్నారు.
ఆస్ట్రేలియాలో ఎందుకు నిషేదం..?
బయోసెక్యూరిటీ నియమాల ప్రకారం మల్లెపూలతో పాటు ఇతర మొక్కలు, పూలు, గింజలు, కాయగూరలు, మట్టి, జంతు సంబంధిత ఉత్పత్తులు తీసుకెళ్లినా కూడా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. వాటి ద్వారా ఆయా క్రిమికీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని వారు కనుగొన్నారు.