
ప్రస్తుతం తమిళ నటుడు విశాల్ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?
అయితే విశాల్ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.

నడిగర్ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్ కమల్ హాసన్ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు,
ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్ ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్‌లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్ చేశారు.
భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది.
పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.