మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు, గొంతు లాంటివి ఇకపై ఎవరైనా సరే అనుమతి లేకుండా ఉపయోగిస్తే అంతే సంగతులు. ఎందుకంటే చిరు వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్.. శనివారం (అక్టోబరు 25) మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, గాత్రం తదితర అంశాల్ని వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది.
అలానే కృత్రిమ మేథస్సు (ఏఐ)తో తయారు చేసిన మార్ఫ్ ఫొటోలు, వీడియోలు వినియోగించడాన్ని కూడా ఆపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దృష్టికి చిరంజీవి తీసుకువచ్చారు. ఆయన పేరుతో వీడియో, మీమ్స్ చేసి అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తద్వారా ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలుగుతోందని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు.
(ఇదీ చదవండి: నా దొంగ మొగుడు.. ప్రశాంత్ నీల్ భార్య పోస్ట్ వైరల్)
ఈ ఆదేశాల ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్, గొంతు, ఆయనకు మాత్రమే సొంతమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలని ఏ రూపంలోనైనా ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నాగార్జున కూడా ఇలానే న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వీటిలో 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. వచ్చే వేసవిలో 'విశ్వంభర' థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: 'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?)


