బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
వెల్దుర్తి(తూప్రాన్): సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను పార్టీలకతీతంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం వెల్దుర్తిలో నిర్వహించిన మండల ప్రభాస్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా బూత్‌స్థాయి అధికారుల వద్ద కొనసాగుతున్న సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు వంటి అంశాలను బీఎల్‌ఓలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశం, సర్పంచ్‌లు ఆదర్శ్, మల్లేశంగౌడ్, నాయకులు శేఖర్‌గౌడ్, నవీన్, బాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్
హవేళిఘణాపూర్(మెదక్): భూ భారతి రీ సర్వే ద్వారా రైతులకు మేలు జరిగి ఇబ్బందులు తీరనున్నాయని అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని శుక్లాల్‌పేట గ్రామంలో మంగళవారం భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో రైతుల భూముల హద్దులకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి రీ సర్వేను నిర్వహించామన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించి అందరికీ న్యాయం చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సాపూర్: కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఆగస్టు 10న చేపట్టిన జైల్ భరో కార్యక్రమానికి అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు కోరారు. ఆయన పలువురు నాయకులతో కలిసి మంగళవారం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రజలు, కార్మికులు, రైతుల వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలన్నారు. ఆయన వెంట ఆయా సంఘాల నాయకులు అన్నపూర్ణ, సురేశ్,శివ,చందర్,నాగభూషణం,రెడ్యానాయక్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
మెదక్ ఆర్డీవో రమాదేవి
రామాయంపేట(మెదక్): వ్యవసాయ భూ ముల రీ సర్వే కోసం గ్రామానికి వచ్చే అధికారులు, సిబ్బందికి సహకరించాలని మెదక్ ఆర్డీవో రమాదేవి సూచించారు. శివ్వాయపల్లిలో మంగళవారం భూ సర్వే గ్రామసభ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రీ సర్వే కార్యక్రమానికి గ్రామస్థులు సహకరించాలన్నారు. సర్వే అధికారులు గ్రామంలో వ్యవసాయ భూములను పూర్తి స్థాయిలో రీ సర్వే చేస్తారని, ఏళ్ల తరబడి భూసంబంధిత గొడవలు ఈ సర్వేతో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. సర్వే విభాగం ఏడీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


