ఒకే కుర్చీ.. ఇద్దరు అధికారులు! | - | Sakshi
Sakshi News home page

ఒకే కుర్చీ.. ఇద్దరు అధికారులు!

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

● నిజాంపేట పశువైద్యశాలలో వింత పరిస్థితి.. ● గందరగోళంలో రైతులు

నిజాంపేట (మెదక్‌): మండల పరిధిలోని పశువైద్యశాఖ కార్యాలయంలో ఒక వింత పరిస్థితి నెలకొంది. ఒకే పోస్టుకు ఒకరికి రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చి, మరొకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ప్రస్తుతం ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మండలంలోని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. పశువులకు అనారోగ్యం వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు.

రిలీవింగ్‌ ఇచ్చినా కుర్చీ వదలని వైనం

గతంలో ఇక్కడ ఇన్‌చార్జిగా పనిచేసిన డా.మణికుమార్‌ (వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌ నుంచి నిజాంపేటకు వచ్చారు. అయితే, ఉన్నతాధికారులు గత నెల 15వ తేదీన ఆయనను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ, ఆయన నిజాంపేట కార్యాలయాన్ని వదలకుండా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్తూ తానే అసలైన పశువైద్యాధికారిని అని రైతులకు చెప్పుకుంటుండటం గమనార్హం.

రంగంలోకికొత్త ఇన్‌చార్జి

డా. మణికుమార్‌ స్థానంలో ఉన్నతాధికారులు డా.సుధాకర్‌ దేశ్‌ముఖ్‌ను కొత్త ఇన్‌చార్జి పశువైద్యాధికారిగా నియమించారు. ప్రస్తుతం ఆయన కూడా బాధ్యతలు చేపట్టడంతో ఒకే కార్యాలయంలో ఇద్దరు అధికారులు చలామణి అవుతున్నారు. ఈ ఇద్దరి ఆధిపత్య పోరుతో కార్యాలయ సిబ్బందితో పాటు, సేవల కోసం వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిజాంపేట పశువైద్య కార్యాలయం

శాఖాపరమైన

చర్యలు తీసుకుంటాం

‘డా. మణికుమార్‌ను ఇప్పటికే అధికారికంగా విధుల నుంచి రిలీవ్‌ చేశాం. ప్రస్తుతం నిజాంపేట ఇన్‌చార్జి పశువైద్యాధికారిగా డా. సుధాకర్‌ దేశ్‌ముఖ్‌ మాత్రమే బాధ్యతల్లో ఉన్నారు. రిలీవింగ్‌ ఆర్డర్స్‌ తీసుకున్న తర్వాత కూడా మణికుమార్‌ కార్యాలయానికి వస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు సేకరించి, తగిన చర్యలు తీసుకుంటాం.‘

– వెంకటయ్య, జిల్లా పశువైద్యాధికారి

Advertisement
 
Advertisement
Advertisement