కొల్చారం(నర్సాపూర్): మండలంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 5 పూర్వప్రాథమిక (ఫ్రీప్రైమరీ) పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ డైరెక్టర్ ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంఈఓ ఉమారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఐదింటిలో యూపీఎస్ కొల్చారం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అప్పాజీపల్లి, రాంపూర్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రంగంపేట, పోతంశెట్టిపల్లిలో ఈ నెల 12 నుంచి అధికారికంగా తరగతులు ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రీ ప్రైమరీ బోధనా సిబ్బంది కోసం దరఖాస్తుల స్వీకరణ సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేపట్టారు. ప్రతి పూర్వ ప్రాథమిక పాఠశాల నిర్వహణ కోసం ఒక ఇన్స్‌ట్రాక్చర్, ఒక ఆయా పోస్ట్ ఒప్పందం ప్రాతిపదికన మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఇన్స్‌ట్రాక్చర్ పోస్ట్ కోసం పూర్వ ప్రాథమిక విద్యలో డీఈడీ లేదా ఇంటర్మీడియట్ చదివిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. నెలవారి గౌరవ వేతనం రూ.8 వేలు అందించనున్నారు. ఆయా పోస్ట్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొన్నారు. వీరికి నెలవారి గౌరవ వెత్తనం రూ.6 వేలు అందించనున్నారు. రెండు పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా స్థానికులై ఉండాలని,ఽ దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేస్తూపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.


