నర్సాపూర్: ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఇన్‌గేట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన ఒక షెడ్డుకు తాళం వేయడానికి వచ్చిన అధికారులను బుధవారం బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. పైకోర్టుకు వెళ్లేందుకు కొంత గడువు ఇవ్వాలని వారు కోరడంతో అధికారులు తాత్కాలికంగా వెనుదిరిగారు. స్థానిక బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద ఆర్టీసీ స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి షెడ్డు నిర్మించగా ఆర్టీసీ అధికారులు జిల్లా కోర్టులో కేసు వేశారు. ఆ స్థలం ఆర్టీసీకే చెందుతుందని, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. డిపోకు చెందిన పలువురు అధికారులు షెడ్డుకు తాళం వేయడానికి అక్కడికి వెళ్లారు. బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి వచ్చి తాళం వేయొద్దని తమ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిపో మేనేజర్‌తో మాట్లాడుతారని చెప్పడంతో వారు కొంతసేపు నిరీక్షించారు. కొంతసేపటికి డిపో మేనేజర్ సురేఖ నుంచి స్థానిక ఆర్టీసీ అధికారులకు షెడ్డుకు తాళం వేయొద్దని ఫోన్ రావడంతో వారు అక్కడి నుంచి వెవెళ్లిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. షెడ్డు నిర్మించిన వ్యక్తి పైకోర్టుకు వెళ్లేందుకు కొంత గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిపో మేనేజర్‌కు వివరించి తాళం వేయొద్దని కోరారని చెప్పారు.


