టాయిలెట్, గ్యాస్ లేకున్నా.. ఉన్నట్టే రాయాలి మెదక్ అర్బన్: జిల్లాలో ఈనెల 11 నుంచి ఎన్యుమరేషన్ విధులు ప్రారంభం కాగా, జూన్ 9న సర్వే పూర్తి కావాలి. ఇందుకోసం 1,439 ఎన్యుమరేటర్లు, 261 సూపర్ వైజర్లు విధులు నిర్వర్తిస్తున్నారు .జిల్లాలో 2,30,191 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి యజమానికి 34 ప్రశ్నలు అడిగి, వారు చెప్పిందే నమోదు చేసుకోవాలని శిక్షణ సమయంలో అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎన్యుమరేట ర్లు మండుటెండలో తిరుగుతు సుమారు 60 శాతం సర్వే పూర్తి చేశారు. కాగా ఎన్యుమరేటర్లు చేసిన సర్వేను సూపర్ వైజర్లు, అనంతరం చార్జి ఆఫీసర్లు అప్రూవ్ చేయాలి.
సర్వేలో వాస్తవ పరిస్థితులను ఎన్యుమరేటర్లు నమో దు చేశారు. అందులో కొంత మంది ఇళ్లలో టాయిలెట్లు, గ్యాస్, తాగు నీటి సౌకర్యాలు లేవు. దీంతో ఎన్యుమరేటర్లు ఉన్నది ఉన్నట్లే నమోదు చేశారు. కానీ చార్జి ఆఫీసర్లు మాత్రం ససేమీర అంటున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నట్లు, లేకున్నా పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగిస్తున్నట్లు రాయాలని చెబుతున్నారు. కానీ ఎక్కడైనా, గ్రామ పంచాయతీల్లో, గిరిజన తండాలో పబ్లిక్ టాయిలెట్లు ఉండవు అనే నిజాన్ని మరిచి పోతున్నారు. అప్పట్లో స్థానిక అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారం మేరకే జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే మరో తప్పును చేయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల మిషన్ భగీరథ నీరు అందక బోరు నీటినే తాగుతున్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో పలువురు కట్టెల పొయ్యిలు ఉపయోగిస్తున్నారు. అయితే 2017 నాటికి జిల్లాలో 72,063 టాయిలెట్లు, అంతకుముందు 28,513 ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త ఇళ్లకు 712, ఇందిరమ్మ ఇళ్లకు 4,434 మంజూరు చేసినట్లు తెలిపారు. కానీ జిల్లాలో 2,30,191 కుటుంబాలు ఉండటం గమనార్హం. మొత్తం మీద ఇప్పటికీ టాయిలెట్, గ్యాస్, మిషన్ భగీరథ నీళ్లు అందని ఇళ్లు ఉన్నాయన్నది నిజమని ఎన్యుమరేటర్ల సర్వేలో తేలుతుంది. ఇప్పటికే 60 శాతం సర్వే పూర్తి చేశామని, ఇప్పడు మళ్లీ చేయమంటే ఎలాగంటూ ఎన్యుమరేటర్లు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై పాపన్నపేట తహసీల్దార్ సతీశ్‌ను వివరణ కోరగా, అన్నదమ్ముల్లో ఎవరి ఇంటికి టాయిలెట్ ఉన్నా, లేదా పాఠశాలకు టాయిలెట్ ఉన్నా దానిని ఆక్సెస్‌గా గుర్తించి ఉన్నట్లు రాయాలని చెబుతున్నామని పేర్కొన్నారు.
సెన్సెస్ నమోదులో చార్జి ఆఫీసర్ల హుకుం
2017లో ఓడీఎఫ్‌గా ప్రకటించిఅవార్డు స్వీకరణ
ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికిమరో తప్పు
ఇప్పటికే 60 శాతం సర్వే పూర్తి
లేనిది ఉన్నట్టు..
మళ్లీ మొదటి కొచ్చిన సర్వే
ఎల్లాపూర్‌లో సెన్సెస్ సర్వేకు బయలు దేరిన ఎన్యుమరేటర్లు
‘మెదక్ మండలంలోని ఓ గిరిజన తండాలో సుమారు 20 కుటుంబాలకు వ్యక్తిగత మరుగు దొడ్లు లేవు. సెన్సెస్ ఎన్యుమరేటర్ ఈ మేరకు వివరాలు నమోదు చేశారు. కానీ చార్జి ఆఫీసర్ మాత్రం.. టాయిలెట్, గ్యాస్ లేకున్నా ఉన్నట్లు రాయండి, లేదా కమ్యునిటీ టాయిలెట్ ఉపయోగించుకున్నట్లు రాయండి అని హుకుం జారీ చేశారు. ఇంతకీ ఈ తప్పును ఎందుకు చేయమంటున్నారు అని ఆరా తీస్తే.. నవంబర్ 16, 2017న జిల్లాను ఓడీఎఫ్ (ఓపెన్ డెఫకేషన్ ప్రీ) బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ప్రకటించడంతో, అప్పటి జిల్లా అధికారి అవార్డు సైతం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ అధికారి సెన్సెస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అప్పటి తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రస్తుత జిల్లా అధికారులు మరో తప్పుకు పురమాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి’.