యాసంగి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనుంది. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.4 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకు గాను 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతుల అవసరాలు, విత్తన కంపెనీలకు పోనూ 4 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. – మెదక్‌జోన్
టార్పాలిన్లు, యంత్రాలు సిద్ధం
అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాలు వస్తువులు రైతులకు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ కమిటీల వద్ద 13,307 టార్పాలిన్లు అందుబాటులో ఉండగా, మరో 2 వేలు తెప్పించనున్నారు. ప్రస్తుతం 319 మ్యాచర్ మిషన్లు అందుబాటులో ఉండగా, మరో 325, కాంటాలు 403 ఉండగా, మరో 265 తెప్పించనున్నారు. అలాగే ప్యాడీ క్లీనర్లతో పాటు ఇతర పరికరాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సరిపడా టార్పాలిన్లతో పాటు అన్నిరకాల వస్తువులను అందుబాటులో ఉంచుతాం. కాగా రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలి.
– జగదీశ్వర్, జిల్లా సివిల్ సప్లై అధికారి
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్‌లో 3,03,253 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 2,52,777 ఎకరాలు దొడ్డు రకం కాగా, 50,476 సన్న రకం పంట వేశారు. ఈ లెక్కన సన్న ధాన్యం 1.11 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 6.31 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 7.42 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, ఇందులో రైతుల అవసరాలు, విత్తన కంపెనీలకు 2.97 లక్షల మెట్రిక్ టన్నులు పోనూ 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా. ఇందుకోసం 518 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 418 సెంటర్ల ద్వారా దొడ్డురకం, 100 కేంద్రాల ద్వారా సన్నాలు సేకరించనున్నారు. ఇందులో 328 కేంద్రాలను సహకార సంఘాలు, 190 ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. ఇందుకు కోటి గన్నీ బస్తాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 60 లక్షలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరో 40 లక్షల బస్తాలను తెప్పిస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సీఎంఆర్ కోసం పేర్లు ఇవ్వాలని అధికారులు ఇప్పటికే మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను అడిగినట్లు తెలిసింది. మరాడించే మిల్లులకు సంబంధించి పేర్లు ఇప్పటికీ ఇవ్వలేదని తెలిసింది.
రేపటి నుంచి
కేంద్రాలు ప్రారంభం
జిల్లాలో 3.3 లక్షల ఎకరాల్లో వరి సాగు
4.45 లక్షల మెట్రిక్ టన్నులదిగుబడి అంచనా


