కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే ముఖ్యమని ఎస్టీ గురుకులాల ఆర్సీఓ గంగారామ్‌నాయక్ అన్నారు. బుధవారం కౌడిపల్లిలోని ఎస్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. గత కొన్నిరోజులుగా గురు కులంలో చోటుచేసుకున్న సంఘటనలపై రీజనల్ లెవల్ సీనియర్ ప్రిన్సిపాల్స్ సుమతి, అమర్‌సింగ్, లలితాదేవితో కమిటీ వేయగా, విచారణ జరిపినట్లు చెప్పారు. కొంతమంది ఉద్దేశపూర్వకగా విద్యార్థులను రెచ్చగొడుతున్నట్లు గుర్తించామన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది విద్యార్థుల్లో సైతం క్రమశిక్షణ లోపించిందని, వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి గాడిలో పెడతామన్నారు. విద్యార్థులు చేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా ఎవరూ గురుకులంలోనికి ప్రవేశించవద్దని, ఆలా వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


