ట్రామా కేర్‌ ఏదీ? | - | Sakshi
Sakshi News home page

ట్రామా కేర్‌ ఏదీ?

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

● జిల్లాలో పత్తాలేని ట్రామా కేర్‌ సెంటర్లు ● క్షత్రగాత్రులకు సకాలంలో అందని వైద్యసేవలు

ఈనెల 4న రాత్రి చేగుంట మండలం నర్సంపల్లి తండాకు చెందిన సాయికుమార్‌ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. రామాయంపేట శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సాయికుమార్‌ మృతి చెందాడు. సకాలంలో వైద్యం అందితే ఆ యువకుడు బతికేవాడు.

నవరి 28న కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌కు చెందిన బాలరాజు తన కుటుంబంతో కలిసి ఆటోలో పాతూర్‌ వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట వద్ద ఆటోను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి భార్య సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. బాల్‌రాజును హైదరాబాద్‌ తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇక్కడ ట్రామా కేర్‌ సెంటర్‌ ఉంటే అతడు బతికే అవకాశాలు ఉండేవని పలువురు పేర్కొంటున్నారు.

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట మీదుగా 44వ నంబర్‌ జాతీయ రహదారితో పాటు 765 డీజీ హైవే వెళ్తోంది. కాగా ఈ రెండు జాతీయ రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. క్షత్రగాత్రులను హైదరాబాద్‌ తరలిస్తున్న క్రమంలో చాలా మంది మార్గమధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ ట్రామా కేర్‌ సెంటర్‌ ఉంటే చాలా మంది బతికే అవకాశాలుంటాయి. కాగా గత ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేకంగా ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మెదక్‌తో పాటు పొరుగున ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులో ఉన్న రామాయంపేటకు సైతం గతంలో ట్రామా కేర్‌ సెంటర్‌ మంజూరైనా, అతీగతీ లేకుండా పోయింది.

జిల్లాలో ఒక్క సెంటర్‌ లేదు

ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని గతంలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. జిల్లాలో రామాయంపేట, చేగుంట, తూప్రాన్‌ మండలాల మీదుగా 56 కిలోమీటర్ల మేర 44వ జాతీయ రహదారి, 58 కిలోమీటర్ల మేర 765 డీజీ హైవే విస్తరించి ఉంది. ఈరెండు రహదారులపై ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. క్షత్రగాత్రులను గోల్డెన్‌ అవర్‌లో సకాలంలో ఆస్పత్రికి తరలిస్తేనే బతికే అవకాశాలుంటాయి. ఏ మాత్రం ఆలస్యమైన ఫలితం ఉండదు. నూతనంగా నిర్మించిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామా కేర్‌ సెంటర్‌కు సరిపడా స్థలం ఉంది. ప్రస్తుతం ఈ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. మొదటి, రెండో అంతస్తులు నిరుపయోగంగా ఉన్నాయి. వీటిలో ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రతిపాదనలు పంపాం

జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న రామాయంపేట, నర్సాపూర్‌లో ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు కోసం తా ము ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు ఎలాంటి మంజూరు రాలేదు. త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది.

– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement