భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు
నంగునూరు(సిద్దిపేట): నర్మేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు అన్నదాతలను ఆకట్టుకుంటున్నాయి. ఉద్యాన, ఇరిగేషన్, మార్క్‌ఫెడ్, వ్యయ సాయ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, జనగాం, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చిన రైతులు ఒక్కో స్టాల్ తిరుగుతూ పనిముట్లు, పంటసాగుపై ఆరా తీశారు. ఒక్కో స్టాల్ వద్ద ఆయా కంపెనీల ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించారు.
ఆకట్టుకున్న పాల యంత్రం
పీవీ నరసింహారావు తెలంగాణ యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు విద్యుత్‌తో నడిచే మీగడ తయారీ యంత్రంలో పాలు పోసి చేసే విధానాన్ని ప్రదర్శించారు. యంత్రంలో పోసిన పాలను వివిధ రూపాల్లో వేడి చేయడం ద్వారా గంటలో పెరుగు, నెయ్యి, పాలకోవ, మజ్జిగ, పన్నీర్, మిల్క్‌పౌడర్, జున్ను పాల ఉత్పత్తులను ఏలా తయారు చేయవచ్చో వివరించారు. చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని కళాశాల విద్యార్థి రైతులకు వివరించారు.
డ్రిప్ ద్వారా నీటి ఆదా
ఆయిల్‌పామ్ సాగు తోపాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత పెరగడంతో స్టాల్‌లో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలను అన్నదాతలు ఆసక్తిగా గమనించారు.


