పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: గ్యాస్, యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేటలోని రైతు ఆగ్రో సెంటర్, ప్యాక్స్ సెంటర్లను పరిశీలించారు. అందులో ఉన్న యూరియా, ఎరువుల నిల్వ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గ్యాస్ బుకింగ్ రికార్డులను చూశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు కలుగకుండా సేవలు అందించాలని సూచించారు. అవకతవకలు చోటు చేసుకుంటే, సంబంధిత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ సతీశ్, ఇతర అధికారులు ఉన్నారు. అలాగే టేక్మాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రాన్ని, గ్యాస్ గోదాంను పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. జిల్లాలో సరిపడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరామ్, వ్యవసాయ అధికారి రాంప్రసాద్, ఆర్‌ఐ సాయి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్


