జీవాలకు అమ్మతల్లి టీకాలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): గొర్రెలు, మేకల్లో షీప్ పాక్స్ (అమ్మతల్లి) నివారణకు పశువైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2.90 లక్షల జీవాలు ఉండగా, ఇప్పటికే 2.14 లక్షల జీవాలకు టీకాలు వేశారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఒక్క షీప్ పాక్స్ కేసు కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ పశు పోషకులు, తమ జీవాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి సోకితే జీవాలకు తీవ్ర జ్వరం మొదలై, శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉన్న ప్రదేశాల్లో ఎర్రని బొబ్బలు ఏర్పడతాయి. నోటిలో పుండ్లతో పాటు, కళ్లు, ముక్కు, నోటి నుంచి చీము వంటి ద్రవాలు కారుతాయి. వ్యాధి తీవ్రతరమైతే అంతర్గతంగా ఊపిరితిత్తులో బొబ్బలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. దీంతో ఆహారం, నీరు తీసుకోలేక జీవాలు నీరసించి మృతి చెందుతాయి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ జీవాలను మంద నుంచి వేరు చేయాలి. పాకలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, క్రిమి సంహారక మందులు వేయించాలి. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే తప్పనిసరిగా పశువైద్య సిబ్బందిని సంప్రదించాలి.
అప్రమత్తమైన పశువైద్య సిబ్బంది
నివారణకు ముందస్తు చర్యలు
జిల్లాలో 2.14 లక్షల జీవాలకు
వ్యాక్సినేషన్
టీకా వేయించాను
నా వద్ద సుమారు 200 పైగా జీవాలు ఉన్నాయి. వాటి పోషణే నాకు జీవనాధారం. పశువైద్యుల సలహాలతో గ్రామంలో నిర్వహించిన శిబిరంలో అన్ని జీవాలకు ముందస్తుగానే టీకాలు వేయించాను. ప్రస్తుతం అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పశు వైద్యులను సంప్రదిస్తా.
– పాతూరి యాదయ్య, చండూర్
జిల్లాలో షీప్ పాక్స్ లేదు
తమ సిబ్బంది చేపట్టిన ముందస్తు నివారణ చర్యలతో జిల్లాలో ఇప్పటివరకు షీప్ పాక్స్ నమో దు కాలేదు. జిల్లావ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుంది. త్వరలోనే అనుకున్న లక్ష్యం పూర్తవుతుంది. పశువైద్య శిబిరాలు నిర్వహిస్తాం.
– వెంకటయ్య, జిల్లా పశువైద్యాధికారి
జీవాలకు అమ్మతల్లి టీకాలు


